ఎన్నికలు వస్తున్నాయంటే.. సర్వే సంస్థలు యాక్టివ్ అయిపోతాయి. షెడ్యూల్‌కు కొన్ని నెలల సమయం ఉందన్న దగ్గర నుంచే సర్వేలను విడుదల చేస్తుంటాయి. ఈ సర్వేల్లో పార్టీలు చేయించుకునేవి ఉంటాయి. సొంతంగా చేసేవి ఉంటాయి. మొదటి పని ఇప్పటి వరకూ వైసీపీ చేయించింది. పెయిడ్ సర్వేలతో జనాల మైండ్ సెట్‌ను మార్చాలనుకుంది. దీనికోసం పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించింది. అయితే తాజాగా ఓ సర్వే సంస్థ మాత్రం వైసీపీ ప్రయత్నాలన్నింటినీ బూడిదలో పోసిన పన్నీరు చేసింది. పేదలు - పెత్తందారులంటూ నాలుగు డైలాగ్స్ వేసేసి జనాల అటెన్షన్‌ని గ్రాబ్ చేసి పబ్బం గడుపుకుందామంటే కుదరదు కదా.
అలా చేసుంటే విజయం పక్కాగా వైసీపీదే..
తెలంగాణ పరిస్థితులను అయినా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అదీ లేదు. కేవలం సిట్టింగ్‌లకు సీట్లు కేటాయించడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయిందనే అపోహతో 60 మంది సిట్టింగ్‌ల మార్చివేతకు రంగం సిద్ధం చేసి తన గొయ్యి తనే తవ్వుకుంటోంది. ఇప్పటికే మూడు ముక్కలాట మొదలు పెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. ప్రత్యేక హోదా మాట మరిచింది. కేవలం సంక్షేమమే అజెండాగా నడిచింది. కనీసం అభివృద్ధి ఊసే ఎరుగదు. అన్నీ ఎలా ఉన్నా ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకతను తెచ్చుకోకుంటే ఈసారి పక్కాగా విజయం వైసీపీనే వరించి ఉండేది. అది కూడా చేయలేదు. ఇప్పుడు ప్రముఖ సర్వే సంస్థలలో ఒకటైన ‘చాణక్య స్టాటజీస్’ ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది.
కేవలం 42 నుంచి 55 సీట్లతో సరిపెట్టుకుంటుందా?
నిజానికి ఈ ఫలితాలు టీడీపీ - జనసేన కూటమికి మంచి బూస్ట్ ఇచ్చేదే. ఆ పార్టీలకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్. ఈసారి పక్కాగా ఏపీలో ఈ కూటమిదే విజయమని ఈ సర్వే సంస్థ తేల్చింది. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన కూటమి 175 నియోజకవర్గాల్లో 115 నుంచి 128 స్థానాలలో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందంటూ వైసీపీకి చాణక్య షాక్ ఇచ్చింది. ఇది నిజానికి సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాక్‌ల కంటే పెద్ద షాక్. ఈసారి వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లతో సరిపెట్టుకుంటుందని తేల్చింది. అయితే దాదాపు 18 స్థానాల్లో మాత్రం ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా? అన్నట్టుగా ఉంటుందట. అటు చూస్తే ఏపీ సీఎం జగన్ ‘వై నాట్ 175’ అంటుంటే 50 సీట్లు కూడా రావంటూ ఆయన కలలపై చాణక్య పెద్ద దెబ్బే వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.