ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు వస్తే.. విజయమ్మ కూతురి పక్షాన నిలిచి ఆమెతో పాటే తెలంగాణకు తరలి వెళ్లిపోయారు. షర్మిల సైతం ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా తాను స్వయంగా పోరాడి అధికారంలోకి తీసుకొచ్చిన అన్నకు వ్యతిరేకంగా పని చేయనున్నారు. ఈ తరుణంలో విజయమ్మ కొడుకు వైపు ఉంటారా? కూతురి వైపు ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల..!
జనవరి 4న వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే విషయమైతే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం లోటస్ పాండ్‌లో మొదలైన వైఎస్సార్టీపీ భేటీలో.. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకు క్లియర్ కట్‌గా షర్మిల చెప్పేశారు. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకు చెప్పేశారు. రేపు సాయంత్రం ఢిల్లీకి షర్మిల వెళ్లబోతున్నారు. మొదట నాలుగో తారీఖు అనుకున్నప్పటికీ.. ఒకరోజు ముందే మూడోతారీఖున ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. ఈ క్షణమో.. మరు క్షణమో ఇడుపుల పాయ వేదికగా ఈ విషయాన్ని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. 4న ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే ఆమెకు ఏ పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ పదవి ఇస్తారా? లేదంటే ఏపీ పీసీసీ పదవి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది.
విజయమ్మ ఎవరి వైపు ఉంటారు?
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ, సీడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పీసీసీ ఖాయమంటూ టాక్ అయితే నడుస్తోంది. ఇదే జరిగితే పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. విజయమ్మ ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు కూడా కూతురికే మద్దతుగా నిలుస్తారా? లేదంటే తటస్థంగా ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న అంశాలు వచ్చేసి.. షర్మిల ఎంట్రీతో వైసీపీ ఎంత మేర నష్టపోతుంది? విజయమ్మ ఎవరివైపు ఉంటారు? వైసీపీలోని నేతలు ఎంతమంది షర్మిల పంచన చేరుతారు? అన్నకు షర్మిల ఎదురెళ్లి నిలుస్తారా? షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు బలపడుతుంది? అనేది చూడాలి మరి.