ఒకవైపు బీజేపీదే అధికారమంటూ సర్వేలన్నీ కట్టగట్టుకుని మరీ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క అంశాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకుని బీజేపీ దూసుకెళుతోంది. ఇలాంటి సమయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన ఇండియా కూటమి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. పూటకో కుమ్ములాటతో తడబడుతూ అడుగులు వేస్తోంది. బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నీ ఇండియా కూటమిగా జత కట్టాయి. కానీ ఆ కూటమికి అడుగడునా గండాలే. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ప్రధాని పదవి కోసం కుమ్ములాట.
ఇతర పార్టీల నేతలు ఒప్పుకుంటారా?
నితీష్ కుమార్ అని ఒకరు.. మల్లిఖార్జున ఖర్గే అని మరొకరు.. రాహుల్ గాంధీ ఎందుకు వద్దని ఇంకొకరు. పోనీలే ప్రధాని పదవి సంగతి తర్వాత చూద్దాం. ముందుగా సీట్ల సర్దుబాటు విషయం చూసుకుందామని అనున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. మరి ఇలా చేస్తే ఇతర పార్టీల నేతలు ఒప్పుకుంటారా? ససేమిరా అంటున్నారు. మహారాష్ట్రలో శివసేన, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఈ లెక్కన చెప్పుకుంటూ పోతే బిహార్, ఝార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లోనూ లోక్‌సభ సీట్ల పంపకంలో తేడాలొస్తున్నాయి.
ఈ యాత్ర కూడా పక్కాగా సక్సెస్..
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో ఆ పార్టీకి సీట్లు ఎక్కువ ఇచ్చేది లేదని కొన్ని పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ నెల 14 నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ చేపడుతున్నారు. భారత్ జోడో యాత్రకు మంచి మైలేజ్ వచ్చింది కాబట్టి ఈ యాత్ర కూడా పక్కాగా సక్సెస్ అవుతుందని నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాబట్టి సీట్ల పంపకం విషయంలో తగ్గేదేలేందంటోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఓ స్టెప్ ముందుకేసి సీట్ల పంపకం కోసం జాతీయ అలయన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు అన్ని పార్టీలతో సమావేశమై సీట్ల పంపకంపై ఓ నిర్ణయానికి రానున్నారు. మరి దీనిని ఇతర పార్టీ యాక్సెప్ట్ చేస్తాయో లేదో చూడాలి. సమస్యల వలయంలో ఇండియా కూటమి ఉంది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది పరిస్థితి.