యూట్యూబ్ ఛానల్స్ ప్రచారమా బీఆర్ఎస్‌ను ముుంచింది?
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన మీదట ప్రతిపక్షంలో ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా అసెంబ్లీలో కూర్చోవాలంటే కాసింత కష్టమే పైకి మాత్రం రాజకీయ గెలుపోటములు సహజమంటూ చిలక పలుకలన్నీ పలికేస్తారు కానీ పలికినంత సులువేం కాదు ఓటమిని యాక్సెప్ట్ చేయడం. పైకి తమకు తిరుగులేదనుకుని నిన్న మొన్నటి వరకూ విర్రవీగిన పార్టీలకు ఇది చాలా కష్టం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థితిలో ఉంది. ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చింది లేదు. ఏదో సర్జరీ అయితే వీడియోల్లో కనిపించారంతే. ఇక కేటీఆర్ విషయానికి వస్తే ఆయన కూడా ఓటమిని అంగీకరించే పరిస్థితికి ఇంకా రాలేదనే తెలుస్తోంది.
జనం గుర్తించలేదని ఆయన చెబుతున్నట్టే కదా?
తాజాగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక ఎన్నో ఇంట్రస్టింగ్ అభిప్రాయాలు, సూచనలు విశ్లేషణలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ కేసీఆర్ 32 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు.. తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు 32 యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదేమో అని పేర్కొన్నారు. అంటే తాము చేసిన అభివృద్ధిని జనం గుర్తించలేదని ఆయన చెబుతున్నట్టే కదా? యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న చెత్త ప్రచారాన్ని జనమంతా వెర్రి గొర్రెల మాదిరిగా నమ్మేసి తమను ఓడించారనేది ఆయన అభిప్రాయమా? అసలు ఎందుకు కేటీఆర్ ఇలా ఆలోచిస్తున్నారనేది ఆశ్చర్యకరంగా మారింది.
ఈ యూట్యూబ్ ఛానల్స్ మహిమేనా?
గతంలో బీఆర్ఎస్ గెలిచిందన్నా ఈ యూట్యూబ్ ఛానల్స్ మహిమేనా ఈ లెక్కన? ఇప్పటికైనా నిజం గ్రహించాల్సింది పోయి ఇంకా ఏవో భ్రమల్లో ఉండిపోతే కష్టం కదా. తమ ఓటమికి అసలు కారణాలను గ్రహించాలి. వాటిని సరిదిద్దుకోవాలి. కానీ ఎవరూ ఊహించని రీతిలో యూట్యూబ్ ఛానల్స్ ప్రచారాన్ని నమ్మి జనం తమను ఓడించారనుకుంటే అంత పిచ్చితనం మరొకటి ఉండదు. ఓటమి మీలోని అహాన్ని చంపేస్తుందన్న భ్రమల్లో ఉన్న ప్రజానీకానికి వాటిని తొలిగించే పనులు చేయాలి కానీ ఇదేంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.