ఏపీ సీఎం జగన్‌ను సమస్యలన్నీ ఏదో పగబట్టినట్టుగా ఒక్కసారిగా చుట్టుముట్టేసి ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఈ తరుణంలో ఆదుకోవడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా లేరు. ఎలాగైనా సరే.. సమస్యల వలయంలో నుంచి బయటపడాలని మైనస్‌లన్నీ వెదుక్కొని ఒకచోట పోగేసి ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలని భావిస్తున్నారు. ఆయన చేతిలో ఉన్నవి అవుతున్నాయి. కొన్ని లేని సమస్యలను తీసుకొచ్చి పెడుతున్నాయి. మొత్తానికి తాడే పామై కాటేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందే.. టైం బాగోలేనప్పుడు అరటి పండు తిన్నా కూడా పన్ను విరుగుతుందని.. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అదే.
గట్టు దాటేందుకు సిద్ధమవుతున్నారు..
ఒకవైపు చెల్లి షర్మిల.. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంప్.. ఇంకోవైపు టీడీపీ, జనసేనల పొత్తు, వేరొక సైడ్ కుల రాజకీయం.. ఒక మనిషిని ఎన్నని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి? సమస్యలకైనా బుద్ధి ఉండక్కర్లే.. చెల్లి దగ్గరకు బాబాయిని రాయబారానికి పంపినా ఆమె ససేమిరా అంటోంది. పోనీలే సిట్టింగ్‌లతో లేనిపోని తలనొప్పి వచ్చేలా ఉంది కాబట్టి వారిని మారుద్దామంటే ఎక్కడికక్కడ గట్టు దాటేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. టీడీపీ, జనసేనల పొత్తుతో తలకాయ బొప్పి కడుతోంది.. విడదీద్దామంటే ఏ పార్టీ కేడర్ కూడా వినేలా లేదు. ఇక అన్నిటికీ తోడు కుల రాజకీయం. అధికారుల దగ్గర నుంచి నేతల వరకూ అన్ని చోట్లా రెడ్డి రాజ్యమే.
ఊ కొట్టి ఊరుకుంటుందా?
ఇది జనంలోకి బాగా వెళ్లిపోయింది. ఇక లాభం లేదు. కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్టుగా.. నా అధికార పీఠం చేజారడానికి కూడా వంద కారణాలున్నాయి. వాటిలో కులం ఒకటని గ్రహించిన జగన్ ఆ వైపు నుంచి నరుక్కు రావడం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. గతంలో 151 సీట్లు గెలిస్తే 50 మందికి పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఈసారి కూడా ఇలాగే జరిగితే తెల్ల గుడ్డే గతని బీసీలకు పెద్ద పీట వేసేందుకు సిద్ధమయ్యారు జగన్. ఈసారి బీసీలకు దాదాపు 90 సీట్ల వరకూ కేటాయించాలని భావిస్తున్నారట. ఇక ఎస్సీలకు 39, ఎస్టీలకు 7.. మొత్తంగా దాదాపు 125 సీట్లు వీరికి పోతాయి. మిగిలిన 50 సీట్లను కాపులు, కమ్మ, రెడ్డి తదితర సామాజిక వర్గాలకు సర్దాలి. అబ్బో పెద్ద చిక్కే వచ్చి పడింది. అరకొర సర్దుతామంటే సొంత సామాజిక వర్గం ఊ కొట్టి ఊరుకుంటుందా? రెడ్లకు అన్యాయం చేస్తావా.. జగనన్నా? అని బిక్కమొహం వేసుకుని చూస్తుందా? పార్టీని వీడుతుందా? ఏమో చూడాలి..