2023 సంవత్సరం కొన్ని చేదు అనుభవాలను, ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2023.. చరిత్రలో నిలిచిపోయే సంవత్సరంగా పరిగణించవచ్చు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్.. ఇలా అన్నింట్లో టాలీవుడ్ సత్తా చాటి.. ప్రపంచ సినిమాని ఆకర్షించింది. 2023 ఇచ్చిన స్పూర్తితో 2024 మరింత గొప్పగా సాగాలని కోరుతూ.. సెలబ్రిటీలందరూ న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
2023 తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆస్కార్, గోల్డెన గ్లోబ్, జాతీయ పురస్కారాలు, ఎన్నో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇలా చెప్పుకుంటే 2023లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో రకాలుగా విజయాలు అందుకొంది. వైవిధ్యమైన కథా చిత్రాలతో సరిహద్దులను దాటి సక్సెస్ సాధించాం. ఈ ఏడాది సాధించిన విజయాలు, పురస్కారాలు.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలిచేలా చేసి.. ఇంకా గొప్పగా సినిమాలు తీయవచ్చనే కలల్ని, వాటిని సాకారం చేసుకోవచ్చనే ధైర్యాన్నిచ్చాయి. 2023 అందించిన అద్భుతమైన జ్ఞాపకాలను.. సాధ్యమైనంతగా 2024 కూడా అందిస్తుందని ఆశిస్తూ.. 2023కి గుడ్‌బై చెబుతూ.. 2024కి సుస్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చిరంజీవి న్యూ ఇయర్ విషెశ్ తెలిపారు.
2023వ సంవత్సరంలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తే.. ఆ తర్వాత వచ్చిన భోళాశంకర్ చిరుకి నిరాశనే మిగిల్చింది. ఆ పరాజయాన్ని మరిచి.. మరో మెమరబుల్ హిట్‌తో 2024లో ప్రేక్షకులను రంజింపజేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి.