ఏపీలో రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న న్యూస్ వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న న్యూస్ తాడేపల్లిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన చెల్లి.. తిరిగి ఆయన్ను అధికారంలో నుంచి దింపేందుకు సిద్ధమవుతుంటే కలవరపడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో షర్మిల వద్దకు ఏకంగా జగనే రాయబారం పంపినట్టుగా టాక్ నడుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, స్వయాన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిని ఆమె దగ్గరకు పంపి నచ్చ జెప్పే యత్నమైతే చేశారట. కానీ షర్మిల మాత్రం రివర్స్‌లో బీభత్సమైన క్లాస్ అయితే పీకారట.
ఆ అన్నకు చెల్లే కదా..
జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లవుతుందని కాబట్టి అలాంటి పని చేయవద్దని షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి సూచించారట. దీంతో ఫైర్ అయిన షర్మిల తాను రోడ్డున పడిన నాడు కానీ.. తనకు దారుణంగా అన్యాయం జరిగిన రోజు కానీ ఎందుకు తన వద్దకు రాలేదని సూటిగా ప్రశ్నించారట. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని మీరు.. మానసిక క్షోభ అనుభవిస్తుంటే కన్నెత్తి చూడని మీరు ఇవాళ జగన్‌కు ఏదో అన్యాయం జరిగిపోతుందని పరిగెత్తుకుంటూ వచ్చారా? అసలిదేమి న్యాయమంటూ షర్మిల ఫైర్ అయ్యారట. అయినా సరే.. సుబ్బారెడ్డి మాత్రం వెనక్కి తగ్గకుండా షర్మిలకు నచ్చజెప్పే యత్నం చేశారట. ఆ అన్నకు చెల్లే కదా.. మొండితనంలోనూ అన్నకు తీసిపోరు కాబట్టి తనను రోడ్డున పడేసినప్పుడు అండగా నిలవని కుటుంబం ఇప్పుడు తనకూ అవసరం లేదని తేల్చేశారట.
చెల్లికి ఎదురు పడటానికి కూడా ఇష్టపడలేదు..
రోజులన్నీ ఒకేలా ఉండవన్న విషయం ఇప్పటికైనా జగన్‌కు తెలుసుకోవాలని జనం అంటున్నారు. అధికారంలోకి రావడానికి కారణమైన చెల్లిని కేవలం ఆస్తుల కోసం రోడ్డున పడేస్తే ఆ దెబ్బ గట్టిగానే ఉంటుంది. తమ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాలకు చెల్లి వస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆమె వెళ్లాక ఇడుపులపాయకు వెళ్లేలా జగన్ ప్లాన్ చేసుకునేవారు. కనీసం చెల్లికి ఎదురు పడటానికి కూడా జగన్ ఇష్టపడలేదు. ఇప్పటికే పార్టీ ఇబ్బందికర పరిస్థితులకు చేరుకోవడం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గట్టు దాటుతుండటంతో కాస్త ఆందోళనకు గురైన జగన్.. ఇప్పుడు చెల్లి కూడా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆమెపై సోషల్ మీడియా వార్‌కు వైసీపీ సిద్ధమైంది. ఇవన్నీ చేస్తూ కూడా రాయబారం అంటే షర్మిల ఎగిరి గంతేసి వెళతారా? ఇవ్వాల్సిన సమాధానమే ఇచ్చి పంపేశారట.