వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె ధర్నాలు చేసినా.. ఆందోళనలు చేసినా.. ఏం చేసినా జనం లైట్ తీసుకున్నారు. అసలు తెలంగాణలో వైఎస్సార్‌టీపీ కనీసం నామమాత్ర ప్రభావం కూడా చూపించలేకపోయింది. ఇక్కడి వరకూ ఓ లెక్క. కానీ షర్మిల పేరు ఏపీలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తే పెను సంచలనానికి దారి తీస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించి ఏ న్యూస్ అయినా సరే చర్చనీయాంశమే అవుతోంది. ప్రతిదీ ఆసక్తికరంగా మారుతోంది.
జనం ఎవరిని ఎక్కువ ఆదరిస్తారు?
నిజానికి అన్న అయిన ఏపీ సీఎం జగన్ నుంచి విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆయన ప్రస్తావన తీసుకు రాలేదు. ఏనాడూ అన్నకు ఎదురు నిలుస్తానని కూడా చెప్పింది లేదు. అంత సాహసం ఏనాడూ చేయని షర్మిల ఇప్పుడు మాత్రం ఎదురెళ్లేందుకు సిద్ధమవడమే సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జగన్‌కు ఎదురెళ్లి షర్మిల నిలబడగలరా? ఇద్దరు రాజశేఖర్ రెడ్డి బిడ్డలలో జనం ఎవరిని ఎక్కువ ఆదరిస్తారు? వైసీపీ నుంచి బయటపడి టీడీపీ, జనసేనలోకి వెళ్లలేని వారంతా షర్మిల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే తన పొలిటికల్ జర్నీ అని తేల్చేశారు.
షర్మిల నెగ్గుకు రాగలుగుతుందా?
ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫర్మ్ అయితే.. ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తీసుకున్నా కూడా ఆ పార్టీని విజయం దిశగా నడిపించడమైతే సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా టీడీపీ విజయానికి సహకరించవచ్చన్న టాక్ కూడా ఉంది. ఈ తరుణంలో శాసనసభ కంటే లోక్‌సభ ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీనిలో కడప జిల్లా నుంచి షర్మిల లోక్‌సభకు పోటీ చేయవచ్చన్న టాక్ నడుస్తోంది. షర్మిలది కూడా అదే సొంత జిల్లా అయినా కూడా ఆమె వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది కాబట్టి దానిని జగన్ ఇలాఖాగా భావిస్తున్నారు. ఈ తరుణంలో షర్మిల అన్నకే సవాల్ విసిరి నెగ్గుకు రాగలుగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అక్కడ లోక్‌సభ స్థానం అవినాష్ రెడ్డిది కాబట్టి బాబాయిని చంపిన ముద్ర ఆయనపై ఎలాగూ ఉంది కాబట్టి షర్మిలకు అక్కడి జనం పట్టం కట్టబెట్టడం ఖాయమని కూడా భావిస్తున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..