ఎన్నికల తరుణం.. పార్టీలన్నీ వ్యూహాలకు ప్రతివ్యూహంతో ముందుకు వెళ్లాల్సిందే.. లేదంటే దెబ్బైపోతారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ స్ట్రాంగ్ అయిపోయింది. ఇరు పార్టీలు ఓట్లు చీలకుండా పక్కా ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. ప్రతి ఒక్క సీటు కీలకమే కాబట్టి దేనిని కోల్పోకుండా పట్టు బిగుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఎలాంటి విభేదాలు లేకుండా.. అధికార పార్టీ జిమ్మిక్కులకు తలొగ్గి ఆవేశాలకు వెళ్లకుండా దిశా నిర్దేశం చేస్తున్నాయి.
>జనసేనకు కలిసొస్తున్న అంశం అదే..
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో మూడు రోజుల పాటు మకాం వేసి మరీ పార్టీ నేతలు, కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. జనవరిలో మరిన్ని సమావేశాలు నిర్వహించేందుకు పవన్ సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి స్థాయిలో కూటమి ఖాతాలో పడేలా నేతలు, కేడర్‌కు సూచనలు చేస్తున్నారు. నిజానికి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి పట్టుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఇది కూడా జనసేనకు కలిసొస్తున్న అంశం. ఇదే అంశం అధికార వైసీపీకి కలవరపాటుకు గురి చేస్తోంది. అందుకే ఇక్కడ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు తెగ్గొట్టేందుకు చేయాల్సిన యత్నాలన్నీ చేస్తోంది.
>సీట్ల సర్దుబాటును బూచిగా చూపిస్తూ..
ఈ క్రమంలోనే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ రెచ్చగొట్టుడు రాజకీయాలకు తెరదీస్తోంది. కాపు నేతల పేర్లతో నకిలీ లేఖలను సృష్టిస్తోంది. దీనికి పవన్ చెక్ పెట్టే యత్నం చేశారు. ఇప్పటికే అంటే రెండు వారాల కిందటే మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో పవన్ సమావేశమయ్యారు. తిరిగి కాకినాడలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. టీడీపీతో కలిసి వెళ్లడంపై ముఖ్యంగా చర్చించినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు అంశాన్ని వైసీపీ బూచిగా చూపిస్తూ జనసేనకు ఏదో నష్టం జరిగిపోతోందని మొసలి కన్నీరు పెడుతోంది. ఈ విషయంలో కేడర్ తొందరపడకుండా పవన్ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలపై కేడర్‌కు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీలో మరింత కలవరం మొదలైంది.