అర్జున ఫల్గుణ దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళి PS. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో నటించిన శ్రీకాంత్‌కు చాలా మంచి పేరు తెచ్చింది. అప్పుడెప్పుడో చేసిన ఖడ్గం తర్వాత మళ్లీ శ్రీకాంత్‌కు అలాంటి గుర్తింపునిచ్చిందీ చిత్రం. అయితే ఈ మధ్య ఏ సినిమా విడుదలైనా.. నాలుగు వారాల అనంతరం ఓటీటీలోకి వస్తుండగా.. ఈ సినిమా విడుదలై నెలరోజులు అవుతున్నా.. ఓటీటీలోకి రాకపోవడంతో.. ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఓటీటీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అలా వెయిట్ చేసే వారందరికీ ఆహా ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాబోయే సంక్రాంతికి కోటబొమ్మాళి PS ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుపుతూ.. ఆహా సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. సంక్రాంతికి కొత్త సినిమా థియేటర్లలోకి వస్తుంటే.. ఓటీటీలో ఆల్రెడీ హిట్టయిన ఈ సినిమా సందడి చేయనుందన్నమాట. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు.
పోలీసులే పోలీసులని వేటాడితే అనే కాన్సెప్ట్‌తో పాటు.. నేటి పొలిటికల్ వ్యవస్థను కళ్లకు కట్టినట్లుగా ఇందులో చూపించారు. అధికారంలో ఉన్న పార్టీ.. వ్యవస్థలను ఏ విధంగా వాడుతుంది? తద్వారా అమాయకులు ఎలా నలిగిపోతున్నారు? అనేది కోటబొమ్మాళి PS ప్రధానాంశం. థియేటర్లలో అందరినీ మెప్పించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.