2024 ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జనాల్లోకి ఎలా వెళ్లాలి? సభల మాటేంటి? ఎప్పుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలి? మేనిఫెస్టో రూపకల్పన ఎలా? తదితర అంశాలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎన్నికల్లో టీడీపీకి సలహాలిచ్చేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల పీకేను నారా లోకేష్ వెంటబెట్టుకుని మరీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. బాబు - పీకేల మధ్య దాదాపు 3 గంటల పాటు మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు టీడీపీకి సలహాలు ఇచ్చేందుకు పీకే ఒప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
హైలైట్‌గా ప్రచార రథాలు..
ఇక నూతన సంవత్సరంలో టీడీపీ పూర్తి స్థాయిలో రాష్ట్రంపై ఫోకస్ పెడుతుందట. ఇందులో భాగంగానే ముందుగా 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలను నిర్వహించాలని పీకే సూచించారని టాక్. రోజుకి ఒకటి.. వీలైతే రెండు సభలను చంద్రబాబు నిర్వహించనున్నారని సమాచారం. మొదటి బహిరంగ సభ వచ్చేసి రాయలసీమలో జనవరి 5న ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సభల్లో ప్రచార రథాలు హైలైట్ కానున్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానానికి రెండు చొప్పున ప్రచార రథాలను సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సభలను జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాటే జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని కూడా టీడీపీ తలపెట్టనుంది.
వైసీపీ జాబితా రిలీజ్ చేసిన తర్వాతనే..
ఇక తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు మేనిఫెస్టోని విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటివి ప్రకటించడం జరిగింది. దాదాపు జనవరిలోనే అన్ని పనులను టీడీపీ పూర్తి చేయనుందని తెలుస్తోంది. సంక్రాంతి నాటికి టీడీపీ అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ కూడా పీకే సలహాలు, సూచనలతోనే జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీ జాబితా రిలీజ్ చేసిన తర్వాతనే టీడీపీ జాబితాను విడుదల చేయాలని పీకే సూచించారట. ఈలోగా పీకే ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయిస్తారట. ఆ సర్వేతో పాటు వైసీపీ అభ్యర్థుల జాబితాను బట్టి టీడీపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకోనున్నారట. దాదాపు తాను ఇవ్వాల్సిన సలహాలు, సూచనలన్నీ పీకే ఇచ్చేశారట. ఆచరణ మాత్రమే మిగిలి ఉందట.