అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం.. ఆపై సింగరేణి ఎన్నికల్లో దారుణ ఓటమి.. ఎటు చూసినా బీఆర్ఎస్‌కు దెబ్బలే. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయవద్దని వెనక్కి తగ్గి మరీ మళ్లీ ముందుకెళ్లి బోల్తా పడింది. ఇంత ఘోర పరాజయం బీఆర్ఎస్ ఈ పదేళ్లలో ఎన్నడూ చూసింది లేదు. అయ్యిందేదో అయిపోయింది ఇక జరగాల్సిన దానిపై దృష్టి పెడితే పోతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం ఆరంభమవగానే లోక్‌సభ ఎన్నికల కోసం కార్యాచరణను రూపొందించుకోనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
గులాబీ బాస్ యోచన అదేనా?
ఇప్పటి వరకూ ఎదుర్కొన్న ఓటములు గులాబీ పార్టీకి మంచి గుణపాఠాన్నే నేర్పాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో అయినా పట్టు బిగించాలని భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలుండగా.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ టార్గెట్12 నుంచి 15 అని తెలుస్తోంది. ఇన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంటేనే కేంద్రంలో తమ పార్టీకి కాస్త విలువుంటుందని గులాబీ బాస్ యోచనగా తెలుస్తోంది. పైగా మెదక్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ సైతం పోటీ చేయాలని భావిస్తున్నారు. జనవరి 3 నుంచి పూర్తి స్థాయిలో కేసీఆర్ రంగంలోకి దిగనున్నారట. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం.. నాయకులను దీనికోసం సమాయత్తం చేయడం వంటివి చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత ఫిక్స్..!
మొత్తానికి ఫిబ్రవరి రెండో వారం నాటికి అభ్యర్థులను ఖరారు చేసి వారిని ప్రచార బరిలోకి దింపాలని గులాబీ బాస్ భావిస్తున్నారట. అయితే కొన్ని స్థానాలు మాత్రం కొందరు నేతలకు ఫిక్స్ అయ్యాయట. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు ఫిక్స్ అయిపోయిందని సమాచారం. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతల్లో పలువురికి లోక్‌సభ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. వారిలో పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ వంటి వారున్నట్టు సమాచారం. ఇక దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన లిస్ట్ అయితే వైరల్ అవుతోంది కానీ మరి దానిలో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి వచ్చే నెలలో అయితే బీఆర్ఎస్ లిస్ట్ ఖరారు కానుంది.