తెలంగాణపై ఫోకస్ పెట్టి.. అక్కడ అధ్యక్షుడిని మార్చేసి చివరకు సక్సెస్ అయితే సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఏపీలో కూడా పావులు కదుపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా పవనమైన పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం అవసరమైన అస్త్ర శస్త్రాలన్నీ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కనీసం కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రాలేదు. చాలా మంది నేతలు గట్టు దాటేశారు. కొందరు కాంగ్రెస్ కీలక నేతలు రాజకీయాలకే దూరమయ్యారు. ఇప్పుడు వారందరినీ తిరిగి పార్టీలోకి తెచ్చుకుని పార్టీకి తిరిగి జీవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీని కోసం ఎన్ని మెట్లు దిగడానికైనా పార్టీ అధిష్టానం సిద్ధమైపోయింది.
ఏ ఏ అంశాలతో జనాల్లోకి వెళ్లాలి?
ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పనైతే కాదు కానీ ఎలాగైనా ఈసారి పార్టీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. దీని కోసం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి చెందిన కీలక నేతలంతా పాల్గొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు పార్టీలో చేరికలు వంటి విషయాలపై చర్చించారు. అలాగే ఎన్నికలపై మేనిఫెస్టో గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక మున్ముందు ఏ ఏ అంశాలతో జనాల్లోకి వెళ్లాలి? క్షేత్ర స్థాయి నుంచి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి? మేనిఫెస్టోలో చేర్చా్ల్సిన అంశాలేంటి? వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
కీలక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు..
మొత్తానికి సంక్రాంతి తర్వాత నుంచి కాంగ్రెస్ పెద్దలంతా కథన రంగంలోకి దిగనున్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అగ్ర నేతల సభను ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు. హిందూపురంలో మల్లికార్జున ఖర్గే, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, అమరావతిలో ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ పార్టీ సభలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక షర్మిల కూడా ఏపీకి సంబంధించిన కీలక పోస్ట్ ఏదైనా తీసుకుంటే ఆమె ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే చేపట్టింది. ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.