మాజీ సీఎం కేసీఆర్ గురించి ఓ సంచలన విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అది కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ మళ్లీ తానే సీఎం అవుతననే నమ్మకంతో తన కోసం కొత్త కాన్వాయ్‌ను కొన్నారట. ఒక్కోటి రూ.3 కోట్లు విలువ గల 22 లాండ్ క్రూయిజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారని వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త కార్లు కొనడం ఎందుకని.. పాత కార్ల మరమ్మతులు చేసి వాడుకుందామని అధికారులకు చెప్పానన్నారు. అప్పుడే ఒక అధికారి కేసీఆర్ 22 కార్లు కొని విజయవాడలో దాచి పెట్టిన విషయాన్ని తనకు చెప్పారన్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం అంతటోడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయరు..
ఈ వ్యాఖ్యల్లో నిజమెంత? అనే విషయమై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది అంటూ వస్తున్న విమర్శలకు రేవంత్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు తన బంధుగణం దర్జాగా కార్లలో తిరగవచ్చని ఆ కార్లన్నీ కొన్నారట. దరిద్రం కొద్ది కేసీఆర్ ఓడిపోవడంతో ఆ కార్లు వాడుకోలేకపోతున్నారని రేవంత్ చెబుతన్నారు. ఒక సీఎం అంతటోడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయరు. అందునా ఇంత పెద్ద విషయంలో అబద్ధం చెప్పరు కాబట్టి ఇది నిజమనే జనం నమ్ముతున్నారు. పైగా కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం ఎలాగూ కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఆ వ్యాఖ్యలు సత్యదూరమని కొట్టిపడేయలేం. ప్రజాధనంతో కొన్న ఆ కార్లనీ తెలంగాణ ప్రభుత్వానికి చెందినవేనని.. త్వరలో వాటన్నిటినీ హైదరాబాద్‌కు రప్పించి ప్రజల ముందుంచుతామని రేవంత్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి కార్గో విమానంలో గన్నవరానికి..
అయితే దీనికి చాలా వ్యంగ్యంగా బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. నిజానికి కేసీఆర్‌కు ఓ కాన్వాయ్ ఉండగా మరో కాన్వాయ్‌ను అది కూడా అంత పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కౌంటర్ ఇచ్చారు. దీనికి గత ఏడాది జూలై 24న ది హిందూ పత్రికలో వచ్చిన వార్తను ట్యాగ్ చేసి.. కేసీఆర్ కాన్వాయ్‌లో వినియోగిస్తున్న 10 ఫార్ట్యూన్‌లకు మరికొన్ని జతయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే కొన్ని ల్యాండ్ క్రూయిజ్ వాహనాలు హైదరాబాద్ నుంచి ఓ కార్గో విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయని క్రిశాంక్ తెలిపారు. వాటిని విజయవాడ సమీపంలోని ఓ వర్క్ షాపుకు తరలించారన్నారు. అక్కడ వాటన్నింటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా రెండు బస్సులను సైతం కేటీఆర్ పర్యటనల నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ చేసేందుకు వచ్చాయని క్రిశాంత్ తెలిపారు.