రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు ఒకప్పుడు ఒక బ్రాండ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివ సినిమాతో సంచలనాన్ని క్రియేట్ చేసి.. తిరుగులేని దర్శకుడిగా పేరు పొందాడు. ఇప్పుడున్న టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శకులెందరికో ఆయన స్ఫూర్తి. అంతెందుకు దర్శకధీరుడు రాజమౌళి కూడా రామ్ గోపాల్ వర్మ గురించి ఏదో ఒక సందర్భంలో గొప్పగా చెబుతుంటారు. రీసెంట్‌గా కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. అది చూసి వర్మ ఆశ్చర్యపోయాడు కూడా. అలాంటి ఆర్జీవీ.. ఈ రోజు ఒక పొలిటికల్ పపెట్‌గా మారిపోయాడంటూ సోషల్ మీడియాలో ఆయనని ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ మాట్లాడుకుంటుండటం విశేషం.
ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ వంటి వారితో ఎలా అయితే సినిమా చేయాలని హీరోలు కోరుకుంటారో.. అలాగే ఒకప్పుడు వర్మతో సినిమా చేయాలని టాప్ హీరోలందరూ క్యూ కట్టేవారు. కానీ వర్మ చూపు మాత్రం బాలీవుడ్‌పై పడింది. అక్కడికి వెళ్లి.. తనలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసి ఓ రెండు మూడు సినిమాలు మంచిగానే తీశాడు. ఇక ఆ తర్వాతే మొదలైంది.. ఆయన పేరుకున్న పతనం. అది ఎంత దారుణంగా తయారైంది అంటే.. సొసైటీలో వర్మ అనే వాడు ఒక చీడ పురుగు అని ఆయన అభిమానులే మాట్లాడుకునే స్థాయికి వర్మ దిగజారిపోయాడు. టాలీవుడ్‌లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న దర్శకులు చాలా మంది వర్మని అభిమానిస్తారు.. ప్రేమిస్తారు. ఎప్పుడో తీసిన శివ సినిమానే ఇప్పటి వరకు వర్మని కాపాడుతూ వచ్చింది తప్ప.. వర్మలో మరో ప్రత్యేకత ఏం లేదు. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదని వర్మ తెలుసుకుంటే బాగుంటుంది. వర్మపై ఆయన అభిమానుల అభిప్రాయం ఎలా ఉందో.. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కింది పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. అదే ప్రపంచం అనుకునే వర్మ.. ఒక్కసారి బయటకు వచ్చి ఇది చూస్తేనైనా మార్పు వస్తుందేమో..
నెటిజన్ పోస్ట్:
తన ఉనికిని కాపాడుకోవటానికి మనిషి ఎంతకైనా దిగజారుతాడు, దేనికైనా తెగిస్తాడు అనటానికి క్లాసిక్ #example గా ఒక దర్శకుడిని చూపించచ్చు. ఒకప్పుడు సురేష్ కృష్ణ, మణిరత్నంగారికి సమకాలీకుడుగా వెలుగొందిన ఇతడు ప్రస్తుతం రాజకీయ నాయకుల ముఖాలు మార్ఫ్ చేస్తూ, ఓ రాజకీయ పార్టీ ఇస్తున్న డబ్బు కోసం నానా గడ్డి తింటున్నాడు. కానీ, అది అతని వ్యక్తిగత విషయమని వదిలేయలేం. ఎందుకంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రైట్ టు స్పీచ్ హక్కును అడ్డం పెట్టుకొని సొసైటీలోని వివిధ వర్గాలను ఆయన రెచ్చగొడుతున్నారన్నది నిర్వివాదాంశం. ప్రాంతం, కులం పట్ల భావోద్వేగాలు అధికంగా గల తెలుగు ప్రజలు ఈయన చేష్టలను మొదట్లో లైట్ తీసుకొన్నారు. కానీ, రాను రానూ ఇతగాడి వెర్రి వేషాలు, పిచ్చి ప్రేలాపనలు అధికం కావడంతో కొందరు తీవ్రంగా స్పందించారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉన్నా ఒకప్పుడు అతణ్ని అద్భుతమైన సాంకేతిక నిపుణుడిగా, గొప్ప దార్శనికుడిగా అభిమానించిన నా లాంటి వాళ్ళు ఆయన్ని ఇప్పుడు ఒక పొలిటికల్ పపెట్‌గా చూడాల్సి రావటం నిజంగానే బాధగా ఉంది. (హరీష్ ఆర్.ఎమ్.. ఎక్స్ నుండి)