టీడీపీ, జనసేన అయితే పొత్తుతో కలిసి వెళుతున్నాయి కానీ సీట్ల సర్దుబాటు అంశమే ఇరు పార్టీల మధ్య కీలక ఘట్టం. ఇది సెట్ అయ్యిందా అంతా ఓకే. ఈ విషయంలో ఎక్కడ గొడవలు రాకపోతాయా? అని వైసీపీ నేతలు గోతికాడ నక్కల మాదిరిగా కాచుక్కూచున్నారు. ఈ తంతు ముగిసే వరకూ జనసైనికులను మీకు తక్కువ సీట్లు ఇస్తారంటూ రెచ్చగొట్టే పనిలోనే ఉంటారు. అయితే సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరో రెండు మూడు సార్లు సమావేశమయ్యి పూర్తి స్థాయిలో సీట్ల అంశాన్నీ తేల్చేయనున్నారట. దీనికి సంక్రాంతికి డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అంత పెద్ద ఎత్తున డబ్బు పెట్టగలరా?
సంక్రాంతిలోగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ సీట్లు? ఎవరెవరు అభ్యర్ధులు? అనే విషయం తేల్చేయాలని ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. టీడీపీ నుంచి 50-65 సీట్లు, 4-5 లోక్‌సభ సీట్లను జనసేన డిమాండ్ చేస్తోందని సమాచారం. టీడీపీ మాత్రం 25 శాసనసభ, 2 ఎంపీ సీట్లు ఇస్తామని చెబుతున్నట్టు ఊహాగానాలు వినవస్తున్నాయి. నిజానికి జనసేన తరుఫున కొందరు నేతలు అయితే చాలా కష్టపడ్డారు. సొంత డబ్బులు వెచ్చించి మరీ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అంత చేసిన వారికి సీటు దక్కకుంటే ఎలా అని కొందరు నేతలు భయపడిపోతున్నారట. మరి ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న ప్రహసనం. మరి జనసేన నేతలు అంత పెద్ద ఎత్తున డబ్బు పెట్టగలరా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆయనను పట్టుకోవడం కష్టమే..
అయినా సరే.. పట్టుబట్టి జనసేన సగం సీట్లు రాబడితే.. అది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకుంటే మొదటికే మోసం వస్తుంది. సగం కోల్పోయినా సరే అవి వైసీపీ ఖాతాలోకి చేరి కూటమి.. ఓటమి పాలవుతుంది. గెలిచి అధికారంలోకి వచ్చాక అప్పుడు ఏమైనా పదవులు ఆశిస్తే ప్రయోజనకరం కానీ ముందే సీట్ల కోసం పట్టుబడితే కూటమికే నష్టమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి జగన్ అధికారంలోకి వచ్చారంటే ఆయనను పట్టుకోవడం కష్టమే. ఇరు పార్టీలనూ ఊహించని రీతిలో ముప్పు తిప్పలు పెడతారు. పొత్తు విడగొట్టాలని కంకణం కట్టుకున్న వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా.. ఇరు పార్టీలూ నష్టపోకుండా సీట్ల సర్దుబాటు జరగాలి. లేదంటే ఇప్పటి వరకూ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.