టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకెళుతున్నాయి. ఈ సారి ఏపీలో పరిస్థితులు కూడా మారిపోయాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడమూ ఆ పార్టీలకు కలిసొచ్చింది. బీఆర్ఎస్ అహంకారానికి దెబ్బ పడింది. నిజానికి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి పెద్ద ఎత్తున ఓటేసేవారేమో.. కానీ కేసీఆర్ అహంకారం దానిని బీట్ చేసింది. అభివృద్ధిని డామినేట్ చేసింది. వెరసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్‌కు అహంకారమొక్కటే సమస్య. కానీ ఏపీలో వైసీపీకి అన్నీ సమస్యలే. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ చూస్తే మరో ఛాన్స్ అడిగే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. అన్నీ సెల్ఫ్ గోల్సే.
డీల్ కుదిరితే ఏ పార్టీ కోసమైనా పని చేస్తారు..
ఎటు చూసినా టీడీపీ - జనసేన కూటమికి అనుకూల వాతావరణమే. ఇలాంటి తరుణంలో ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ సాయం అవసరమా? ఇది రాంగ్ స్టెప్పే కదా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు సైతం అగ్గికి ఆజ్యం పోసినట్టుగా పీకేతో చంద్రబాబు భేటీ అవడంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఇవి వారిలో అభద్రతా భావం నుంచి పుడుతున్న మాటలే అయినా సరే.. పీకే అవసరం నిజంగానే టీడీపీకి ఉందా? అనేది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్‌కు పార్టీలతో సంబంధం లేదు. డీల్ కుదిరితే ఏ పార్టీ కోసమైనా పని చేస్తారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేశారు. అప్పట్లో టీడీపీపై ఆయన చేయించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
పీకే వైసీపీ పంచన చేరితే..
అయితే టీడీపీ భావన మరోలా ఉండి ఉండొచ్చు. గెలుపు అవకాశాల్లో దేనినీ వదలకూడదనే భావన ఉండి ఉండొచ్చు. అలాగే గత ఎన్నికల్లో వైసీపీకి పీకే పని చేసి ఉండటం వలన ఆ పార్టీ బలాలు, బలహీనతల గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఇది టీడీపీ - జనసేన కూటమికి కలిసొచ్చే అంశం. ఈ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో పీకే వైసీపీ పంచన చేరితే టీడీపీ బలహీనతలను సైతం వినియోగించుకుంటారు కదా అనే అనుమానాలూ లేకపోలేదు. అసలు ఆయనకు నైతిక విలువలంటూ ఏమీ ఉండవంటారు. ఏం చేసినా తంటే. కాబట్టి సొంత వ్యూహాలతోనే టీడీపీ - జనసేన కూటమి ముందుకు వెళితే బాగుంటుందంటున్నారు. ప్రశాంత్ కిషోర్‌ని దూరం పెడితేనే మంచిదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.