అసెంబ్లీ ఎన్నికల నుంచి పెద్ద గుణపాఠమే నేర్చుకున్న గులాబీ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ముందుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు తెరదీసింది. అయితే ఈసారి కాంగ్రెస్ మాదిరిగా గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించనుంది. తెలంగాణలో ఎలాగూ అధికారాన్ని కోల్పోయింది కానీ కేంద్రంలో మాత్రం పట్టుకోల్పోకూడదనే ధృడ సంకల్పంతో బీఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిందని టాక్ నడుస్తోంది. కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటు బరిలో నిలుస్తారని టాక్. ఆయన మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది.
అక్కడ లింగాయత్‌ల సామాజికవర్గం ఎక్కువట..
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆ స్థానం నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారట. చేవెళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డినే బీఆర్ఎస్ టికెట్‌వరించనుందట. మహబూబాబాద్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తారని సమాచారం. ఇక్కడ చేసిన అభివృద్ధితో పాటు బలమైన సామాజిక వర్గం శ్రీనివాస్ గౌడ్‌కు కలిసొచ్చే అంశాలు. నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజును ఈసారి టికెట్ వరించనుందట. కరీంగనర్ నుంచి వినోద్ బరిలోకి దిగనున్నారట. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పోటీ చేయనున్నారట. అక్కడ లింగాయత్‌ల సామాజికవర్గం ఎక్కువగా ఉండటం బీబీ పాటిల్‌కు కలిసొచ్చే అంశమని తెలుస్తోంది.
ఈ సారి కూడా అక్కడ టఫ్ ఫైటే..
నిజామాబాద్ నుంచి కవితకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందట. గత ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి కూడా అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాల్క సుమన్, వెంకటేష్ నేత.. వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయనున్నారట. ఆదిలాబాద్ నుంచి గూడెం నగేష్, వరంగల్ నుంచి పసూనూరి దయాకర్ లేదంటే డాక్టర్ రాజయ్య, నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి నుంచి బాలరాజు యాదవ్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మల్కాజ్‌గిరి నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి తలసాని కొడుకు సాయికిరణ్‌ను బీఆర్ఎస్ బరిలోకి దింపనుందట.