సింగరేణి ఎన్నికలు నేటి (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. ఆ తరువాత రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ముఖ్యంగా తలపడుతున్నాయి. ఇంకా మరికొన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నప్పటికీ కీలక పోటీ మాత్రం పైన పేర్కొన్న అనుబంధ సంఘాల మధ్యే నెలకొంది.
కాంగ్రెస్ పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ..
సింగరేణిలోని మొత్తం 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్‌లలో కార్మికులు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో విచిత్రం ఏంటంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్‌ను ఓడించేందుకు అన్ని విధాలుగా తన సహాయసహకారాలందించిన సీపీఐ ఈ సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో జతకట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకుంది. సింగరేణి ఎన్నికలపై తొలుత కాంగ్రెస్ పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ ఐఎన్‌టీయూసీ నేతల ఒత్తిడికి తలొగ్గిన సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కూడా సింగరేణి ఎన్నికలు కలిసొచ్చే అవకాశం ఉండటంతో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది.
ఆ పార్టీని దెబ్బకొట్టాలని రంగంలోకి దిగిన బీఆర్ఎస్..
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి ఏరియాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. మిగిలిన ప్రాంతాల బాధ్యతలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీసుకున్నారు. వీరిద్దరూ సంబంధిత ఏరియాల్లో విస్తతంగా పర్యటించారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం తొలుత ఇంట్రస్ట్ చూపలేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీని దెబ్బకొట్టాలని రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ నిర్ణయించింది. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదనేది తేలనుంది. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైతే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంచెం క్లిష్ట పరిస్థితులను బీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.