లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. నిన్న మొన్నటి వరకూ కలహాలతో కాపురం చేసిన పార్టీ చేతిలో ఓడిపోవడమంటే కాస్త ఇబ్బందికరమే. దానిని అధిగమించడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితులు మరొక ఎత్తు. కొన్ని రంగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఎన్ని లక్షల కోట్లు గోల్‌మాల్ జరిగిందో కూడా లెక్కలతో సహా వివరించే యత్నం చేస్తోంది. అన్ని వైపులా బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలు జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి.
హ్యాట్రిక్ పీఎం కాబోతున్నారంటున్న సర్వేలు..
కాంగ్రెస్‌పై పూర్తి స్థాయిలో పాజిటివిటీ వచ్చేసింది. ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికలంటే బీఆర్ఎస్‌కు కాస్త కష్టమే. దీంతో గులాబీ బాస్ వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. మోదీ హ్యాట్రిక్ పీఎం కాబోతున్నారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో దోస్తీ.. కాంగ్రెస్‌తో కుస్తీకి సహకరిస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులంటూ ఎవరూ ఉండరు. కాబట్టి బీజేపీతో శత్రుత్వం కంటే మిత్రుత్వమే అన్ని విధాలుగా సహకరిస్తుందనే యోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి అప్పగించడం కూడా బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే బీజేపీతో అంటకాగడమే బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నారట.
కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం..
మరీ ముఖ్యంగా కేసీఆర్ ఎంపీ పదవికి పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి రాలేదు. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. ఈ తరుణంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడం కంటే.. ఎంపీగా లోక్‌సభకు వెళ్లడం మేలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బీజేపీతో దోస్తీ కడితే గతంలో మాదిరిగా కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారట. అదే జరిగితే తిరిగి తెలంగాణలో ఎంతో కొంత అధికారం చెలాయించవచ్చని గులాబీ బాస్ అనుకుంటున్నారట. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎమ్మెల్సీ కవిత వైపు మళ్లకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారట. బీజేపీతో కలిస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని కేసీఆర్ నమ్ముతున్నారట. మొత్తానికి బీజేపీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారని టాక్.