టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదరకుండా చేయాలని వైసీపీ అధినేత సహా కీలక నేతలంతా ట్రై చేశారు. కానీ ఫలితం దక్కలేదు. టీడీపీ అధినేతను సీఎం జగన్ జైలులో పెట్టిస్తే.. అదే పొత్తుకు బాట వేసింది. అంటే పరోక్షంగా పొత్తు పొడవకుండా చూడాలనుకున్న జగనే స్వయంగా రెండు పార్టీలను కలిపేశారు. అంతా అయ్యాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అయినా సరే.. ఎలాగైనా పొత్తును విచ్ఛిన్నం చేయాలని ఇప్పుడు టార్గెట్‌గా పెట్టుకున్నారు. దాని కోసం నీలి మీడియాను ఎడా పెడా వాడేస్తున్నారు. సొంతంగా ఒక స్క్రిప్ట్ తయారు చేసి అనుకూల మీడియాకు పంపి పొత్తు విచ్ఛిన్నానికి నానా తంటాలు పడుతున్నారు.
ఒక్కరి వైపు నుంచే ఎందుకు?
ఇక్కడే ఒక సందేహం రాక మానదు. వీరంతా ఎక్కువగా జనసేనతో పాటు జనసైనికులను టార్గెట్ చేస్తున్నారు. ఇరు పార్టీలూ పొత్తులో ఉన్నప్పుడు ఇద్దరి వైపు నుంచి విచ్ఛిన్నానికి ట్రై చేయవచ్చు కదా? ఒక్కరి వైపు నుంచే ఎందుకు? అన్న డౌటానుమానం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ ఎన్నో కష్టనష్టాలను.. సంక్షోభాలను.. ఎన్నో ఆటుపోట్లను చూసిన పార్టీ. ఇలాంటి ఎన్ని ప్రయోగాలను.. ఎన్ని టార్గెట్‌లను చూసుంటే ఈ స్థితికి చేరుకుని ఉంటుంది? కాబట్టి వైసీపీ నేతలు టీడీపీ జోలికి వెళ్లడం లేదు. ఇటీవలే పుట్టిన లేత పార్టీ కాబట్టి జనసేనపైకి బాణాలను ఎక్కుపెడుతున్నారు. జనసేనికులకు పెద్దగా రాజకీయం గురించి తెలియదనే భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలతోనే ఏదేదో జరిగిపోతోందని లేని నిరుత్సాహాన్ని జనసేన కేడర్‌కు అంటగడుతున్నారు.
పార్టీలోనే ఉండాలా? వీడాలా?
‘చంద్రబాబు కుర్చీలాట… పావుగా పవన్ కళ్యాణ్’ అని టైటిల్స్ పెట్టి మరీ తమ ఆస్థాన సలహాదారులతో కథనాలను వెలువరించి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ యువగళం సభ.. ఆ తరువాతి పరిణామాలను ఈ పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ బాగా వాడుకుంటోంది. ఏపీ సీఎం చంద్రబాబే అన్న లోకేష్ మాటలను భూతద్దంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ వ్యాఖ్యతో జనసైనికులు మనం ఈ పార్టీలోనే ఉండాలా? వీడాలా? అన్నంత రేంజ్‌లో యోచిస్తున్నారట. చంద్రబాబు ఏదో సినిమా ఫంక్షన్‌కు యాంకరింగ్ చేస్తున్నట్టుగా స్టేజీపై అటు ఇటూ తిరుగుతూ అబద్ధాలు చెప్పి బోర్ కొట్టించే యత్నం చేశారట. బోర్ కొట్టినప్పుడు టీవీ కట్టేయాలి కానీ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నంత ఇంట్రస్టింగ్‌గా ఎందుకు చూశారనేది నీలి మీడియాకు, వైసీపీ నేతలకే తెలియాలి. మొత్తానికి పొత్తు విచ్ఛన్నంపై పెట్టే శ్రద్ధలో కాస్తైనా అభివృద్ధిపై పెడితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించవచ్చేమో..