బాహుబలి ప్రభాస్ - KGF ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది సలార్. మొదటి రోజు గట్టిగా హోరు వినిపించింది. రెండోరోజు అదే జోరు కొనసాగింది. మూడో రోజుకి వందల కోట్ల కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ముగిసింది. నిర్మాతల ప్లానింగ్ ప్రకారం ముందు నుంచి అనుకున్నట్టే నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కలిసొచ్చింది. సలార్ హవా కొనసాగింది. కానీ నేడు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ సలార్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ సగానికి పైగా పడిపోయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి.
పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం లో ఎలివేషన్ సీన్స్ తప్ప ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం మిక్సెడ్ టాక్ తీసుకువచ్చింది. శృతి హాసన్ వంటి స్టార్ హీరోయిన్ ప్రభాస్ వంటి మ్యాచో హీరో పక్కన నటించినా.. వారిద్దరి మధ్య సరైన ట్రాక్ లేకపోవడం యువతను నిరాశ పరిస్తే, మోతాదు మించిన వయొలెన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యేందుకు రీజనయ్యింది. దానికి తోడు క్రేజ్ ని క్యాష్ చేసుకునే తాపత్రయంతో టికెట్ రేట్లు అధికంగా పెంచేయడం ప్రేక్షకుల స్పందనపై మరికాస్త ప్రభావం చూపించింది.
క్రిస్మస్ డే వరకూ సినిమాకి ఉన్న హైప్, ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి కానీ నేటి మార్నింగ్ షోస్ నుంచే అన్ని చోట్ల హ్యూజ్ డ్రాప్ వచ్చేసింది అంటున్నారు సలార్ కి. ఇందుకు రిపీట్ వాల్యూ లేకపోవడం ఒక కారణం అయితే, సాధారణ ప్రేక్షకులు సలాం కొట్టి దూరం జరిగిపోయే అధిక టికెట్ రేట్లు ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
మరి సలార్ కి సాలిడ్ గా తగిలిన భారీ టికెట్ రేట్ల సెగ విషయంలో మేకర్స్ వీలైనంత త్వరగా రియలైజయ్యి అనుకూల ధరల్లో సలార్ ని అందుబాటులో ఉంచితే మంచిదేమో. ఎందుకంటే రాబోతుంది మరో వీకెండ్ మాత్రమే కాదు.. ఈ కేలెండర్ కి ఇయర్ ఎండ్.. సో.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరుతో జనం వేరే వినోద కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తస్మాత్ సలార్ జాగ్రత్త.!