సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ తనదైన మార్క్ వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దొరల పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేసి ప్రజా పాలనను అందిస్తామంటూ ఎన్నికల ముందు ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే పాలన సాగిస్తున్నారు. ప్రజావాణి గ్రామస్థాయి వరకూ విస్తరించి ఓ అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన రేవంత్ దానిని సమర్థంగా అమలు పరుస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఐదు పథకాలకు శ్రీకారం చుట్టునున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి ఐదు పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జనాకర్షక పథకాలకు శ్రీకారం..
ఇంతకీ రేవంత్ పేల్చనున్న పాంచ్ పటాకా విషయానికి వస్తే.. గృహజ్యోతి (రూ.500కే గ్యాస్ సిలిండర్), మహాలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2,500 నగదు బదిలీ), చేయూత (నెలకు రూ.4 వేల పింఛను), ఇందిరమ్మ ఇల్లు (ప్రతి లబ్ధిదారునికీ రూ.5 లక్షలు), రైతు భరోసా (ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు) వంటి పథకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తానికి వరుసబెట్టి జనాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే నిర్ణీత కాలవ్యవధిలో పథకాలన్నింటినీ ప్రవేశపెట్టేలా నాలుగు నెలలకోసారి ప్రజా పాలన నిర్వహించాలని సైతం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ ప్రజాపాలన కార్యక్రమం కూడా ఈ నెల 28 నుంచే ప్రారంభం కానుంది.
ఎలాంటి ప్రజా వ్యతిరేకతకూ తావివ్వకుండా..
ఇక ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకుని తద్వారా అర్హులకే ప్రజాపాలన అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి సిద్ధంగా ఉండాలని సైతం రేవంత్ రెడ్డి సూచించారు. మొత్తానికి గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లను లేకుండా చూసేందుకు అయితే సీఎం రేవంత్ యత్నిస్తున్నారు. అలాగే ఎలాంటి ప్రజా వ్యతిరేకతకూ తావివ్వకుండా చూసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండటానికి.. ప్రజలతో మమేకమవడానికి యత్నిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వ పాలనను సైతం రేవంత్ ఎండగడుతున్నారు. శ్వేత పత్రం పేరిట గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని నిరూపించేందుకు యత్నిస్తున్నారు.