గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ కారణం వచ్చేసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీని ఓడించేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పడు పీకే టీంలో భాగమైన ఐ ప్యాక్.. వైసీపీతోనే ఉండిపోగా.. పీకే మాత్రం గట్టు దూకి టీడీపీకి స్నేహ హస్తమందించారు. ఇప్పుడు ఏపీ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. గెలుపు అవకాశాలు టీడీపీ - జనసేన కూటమికే ఉన్నాయనడంలో సందేహం లేదు. దీనికి ఇప్పుడు పీకే కూడా తోడయ్యారు కాబట్టి టీడీపీ తన ఖాతాలో ఎన్ని నియోజకవర్గాలు వేసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
అప్పటి ప్లస్‌లన్నీ ఇప్పుడు మైనస్‌లు..
ఇక మీదట ఏపీ ఎన్నికల పందేలు కూడా గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్ల కంటే టీడీపీ ఎక్కువ సాధిస్తుందా? లేదా? అనే దానిపైనే జరగనున్నట్టు తెలుస్తోంది. అసలు అదేంటో కానీ గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన అంశాలన్నీ ఇప్పుడు మైనస్‌లు అయ్యాయి. అప్పట్లో అన్నను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. ఇప్పుడు ఆమె అన్నకు రివర్స్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ తన శక్తియుక్తులన్నీ కూడగట్టి జగన్‌కు అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన గట్టు దాటేశారు. బాబాయి హత్యను టీడీపీ పైకి నెట్టి బీభత్సమైన సింపతీ కొట్టేశారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీకి ఇదొక ప్లస్. కానీ ఇప్పుడు బాబాయిని హత్య చేసింది వైసీపీ అగ్ర నాయకులేనని తేలింది. కోడికత్తి బీభత్సమైన ప్లస్ వైసీపీకి. కానీ ఇప్పుడు కావాలనే పొడిపించుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు.
పీకే గట్టు దాటారనేది వూహాగానాలే..
ఒక్కొక్కటి జగన్‌కు రివర్స్ అవుతుంటే కీలక నేతలు సైతం గట్టు దాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రశాంత్ కిషోర్‌ని నిన్న మొన్నటి వరకూ నెత్తిన పెట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తోంది. డబ్బులిస్తే కేఏ పాల్ కోసం కూడా పీకే పని చేస్తారని అలాంటి వ్యక్తి గురించి మాట్లాడనవసరం లేదంటూ డాంబికాలు పోతోంది. ఇక జగన్ భజన బృందమంతా అదేనండీ.. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, పేర్ని నానిలు పీకేపై విమర్శలు గుప్పించేందుకు మీడియా ముందు క్యూ కడుతున్నారు. నిజానికి పీకే గట్టు దాటారనేది వూహాగానాలే. అయినా సరే.. వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసలు రాజకీయం ఏపీలో మొదలైంది. గట్టు దాటే నేతల్ని పట్టుకుని ఉండటానికి జగన్ ఏం చేస్తారో చూడాలి.