ఏంటో ఏ ముహూర్తాన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ అరెస్ట్ చేయించారో కానీ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఏదో సామెత చెప్పినట్టు తాడే పామై కాటేస్తోంది. అసలు స్కెచ్ వచ్చేసి చంద్రబాబును తొలుత జైలులో పెట్టించి ఎన్నికల వరకూ బయటకు రానివ్వకూడదు.. ఆ తరువాత మెల్లగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా ఇతర ముఖ్య నేతలందరినీ జైలులో పెట్టించాలి. జనసేనతో పొత్తు కుదరకుండా చూడాలనేవి టార్గెట్‌గా పెట్టుకుని మరీ జగన్ పావులు కదిపారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. అరెస్ట్‌ల పర్వం వచ్చేసి చంద్రబాబుతో ఆగిపోయింది. ఎన్నికల వరకూ జైలులో ఉంచాలనుకుంటే 50 రోజుల్లో తిరిగి వచ్చేశారు.
వైసీపీకి దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది..
పొత్తు పొడవకుండా చూడాలనుకుంటే చంద్రబాబు జైల్లో ఉండగానే పొత్తుకు అంకురార్పణ జరిగింది. నారా లోకేష్‌ను టచ్ కూడా చేయలేకపోయారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య పేరిట ఫేక్ లెటర్స్ సృష్టిస్తూ జనసేనను కార్నర్ చేసే పనిలో పడ్డారు. అది కూడా కుదరలేదు. హరిరామ జోగయ్య స్వయంగా మీడియా ముందుకు వచ్చి నా పేరిట ఫేక్ లెటర్స్ వైరల్ అవుతున్నాయి నమ్మొద్దని చెప్పేశారు. వైసీపీకి దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. ఇక బాల్ కంప్లీట్‌గా టీడీపీ చేతిలోకి వచ్చింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు భేటీ వైసీపీలో పెను అలజడినే సృష్టించింది. ఇప్పటికే నేతలంతా ఎవరి దారి వారు వెదుక్కునే పనిలో పడ్డారు. ఇక పీకే చంద్రబాబుకి ఎన్నికల వ్యూహకర్తగా మారనున్నారనే వార్తలు వైసీపీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కనీసం మొహాలు చూసుకునే పరిస్థితి లేదు..
గోరుచుట్టిపై రోకటి పోటు అన్నట్టుగా తాజాగా సీఎం జగన్ స్వయానా చెల్లెలు, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల నారా లోకేష్‌కు క్రిస్‌మస్ గిఫ్ట్ పంపించడం పెను సంచలనాన్నే సృష్టించింది. దీనిని చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్న నారా లోకేష్ ‘ఎక్స్’ వేదికగా షర్మిలకు నారా కుటుంబం తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. తనకు షర్మిల పంపించిన గిప్ట్ తాలూకు పిక్‌ను కూడా నారా లోకేష్ నెట్టింట షేర్ చేశారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి తనను అధికారంలోకి తీసుకొచ్చిన చెల్లిని ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేక ఇంటి నుంచి తరిమేశారు జగన్. అప్పటి నుంచి అన్నాచెల్లెల్లిద్దరికీ పడటం లేదు. కనీసం మొహాలు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి షర్మిల నారా లోకేష్‌ను సోదరుడిలా భావించి గిఫ్ట్ పంపించడం ఆయన కూడా ఒక సోదరుడిలా రిసీవ్ చేసుకుని ఆమె కుటుంబానికి నారా కుటుంబం తరుఫున విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. జగన్‌కు ఇది పెద్ద దెబ్బే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.