తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా విషయాల్లో కంపారిజన్ జరుగుతోంది. అంతకు ముందు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ జరిగేది ఇప్పుడు కాస్త ఎక్కువైంది. తెలంగాణను చూసి ఎప్పుడూ విమర్శలు రావడం.. ఆ వెంటనే ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయిపోయి ఏదో ఒకటి చేసేసి మళ్లీ విమర్శల పాలవడం జరుగుతూనే ఉంది. తెలంగాణలో కేబుల్ బ్రిడ్జి ఉంది.. ఆహా.. ఓహో అంటుండగానే ఏపీలో ఆఘమేఘాల మీద కేబుల్ బ్రిడ్జి నిర్మించారు జగన్. దాని దగ్గరకు వెళ్లి చూస్తే కానీ జనాలకు దాని సోకేంటో తెలియదు. తాళ్లతో కట్టి కేబుల్ బ్రిడ్జి అని కలరింగ్ ఇచ్చారు జగన్. జనం షాక్ అయ్యారు. ఇలాంటి పనికిమాలిన పనులు తప్ప జగన్ చేసిందేమీ లేదు.
తొలి రోజు ఓ అర్ధ గంట పాటు మాత్రమే...
ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది. దానిని చూసిన ఏపీవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి ఏపీ వాసులకు తెలిసిన అసెంబ్లీ సమావేశాలు వేరు. తెలంగాణలో జరుగుతున్నవి వేరు. తెలంగాణ అసెంబ్లీకి, ఏపీ అసెంబ్లీకి నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో విడ్డూరంగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో భజనలు జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీలో వినూత్నంగా అధికారపక్షంతో పాటు విపక్ష పార్టీలన్నీ ఉంటున్నాయి వెటకారంగా.. అదే ఏపీ అసెంబ్లీలో అయితే అధికార పక్షం ఒక్కటే ఉంటుంది. విపక్షాలు ఉంటాయి కానీ తొలి రోజు ఓ అర్ధ గంట పాటు మాత్రమే. ఆ తరువాత ఏదో ఒక మెలిక పెట్టి సస్పెండ్ చేసి మార్షల్స్‌తో బయటకు గెంటించేసి చేతులు దులిపేసుకుంటారు.
ఏపీలో ఈ విడ్డూరం ఎప్పుడైనా చూశామా మనం?
ఈ తెలంగాణలో సీఎం రేవంత్ వర్గానికి ఆ మాత్రం తెలియనట్టుంది. సమస్యలపై విపక్షాలతో చర్చలు పెట్టారు. రేవంత్ సర్కార్ స్వేత పత్రం విడుదల చేస్తే.. విపక్షం కౌంటర్‌లిస్తోంది. ఏపీలో ఈ విడ్డూరం ఎప్పుడైనా చూశామా మనం? విపక్షానికి కౌంటర్ ఇచ్చేంత సీన్ జగన్ ప్రభుత్వం ఇస్తుందా? అందరినీ గెంటించేసి అధికార పక్షం మాత్రమే ఉండి భజన సభ మొదలు పెడుతుంది. మన కోడిగుడ్డు మంత్రిగారు లేచి.. మసాలా పొడి ఎంవోయూ గురించి.. కోడిగుడ్డు ఎంవోయూ గురించి వివరిస్తారు. ఆపై మహిళ మంత్రులు లేచి.. ఖలేజా సినిమా డైలాగ్స్‌తో పాటు మరికొన్నింటిని జగన్‌కు అన్వయించి చిడతలు లేకుండానే భజన చేస్తుంటారు. ఏపీలో సమస్యలేమీ లేనట్టు కలరింగ్ ఇస్తారు. ఏపీలో ఏనాడైనా విపక్షాలకు మైక్ ఇవ్వడం చూశామా? ఏదో ఇచ్చీ ఇవ్వనట్టు ఇస్తారంతే.. కానీ తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలకు మైక్ ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏదిఏమైనా ఏపీ అసెంబ్లీ, తెంగాణ అసెంబ్లీకి చాలా తేడా ఉంది.