ఐదేళ్లకోసారి ఎన్నికలు ఎంత కామనో.. ఎన్నికల సమయంలో కొత్త పార్టీలు పుట్టుకురావడం అంతే కామన్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నాటి నుంచి రాజకీయాల్లో ఉంటూ సడీచప్పుడు లేకుండా సడెన్‌గా రాజకీయపార్టీ పేరుతో పాతదేవుడే కొత్తగా పుట్టుకురావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. విషయం మీకు అర్థమైపోయే ఉంటుంది. కొత్తగా ఏపీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. మాంచి ముహూర్తం చూసుకుని మరీ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ ని ప్రారంభిస్తున్నట్లు విజయవాడ వేదికగా ఆయన వెల్లడించారు. అసలు ఆయనకు సొంతంగా పార్టీ పెట్టాలన్న యోచన ఎలా వచ్చింది? ఎవరైనా ఇన్‌స్పైర్ చేసి ఎవరినైనా కార్నర్ చేసేందుకు పెట్టించారా? లేదంటే ఆయనే పెట్టారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
సక్సెస్ అయిన దాఖలాలే లేవు..
గత ఎన్నికలలో లక్ష్మీనారాయణ విశాఖ లోక్‌సభకు జనసేన తరుఫున పోటీ చేసి కేవలం 4,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నారని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన రాష్ట్రమంతా పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. చివరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే ఓ రాజకీయ వేదిక అవసరమంటూ పార్టీని స్థాపించారు. కొత్తగా పార్టీలేవీ తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో సక్సెస్ అయిన దాఖలాలే లేవు. లోక్‌సత్తా నుంచి మొదలు ఏ పార్టీ కూడా సక్సెస్ అయ్యింది లేదు. అంతెందుకు దశాబ్ద కాలానికి పైనే అవుతోంది జనసేనను స్థాపించి.. కానీ ఇంకా జనసేనాని సక్సెస్ కాలేదు. ఈసారి జరిగే ఎన్నికల్లో కానీ జనసేన సత్తా ఏంటో తెలియదు.
ఎవరి కోసం ఓట్లు చీల్చాలనుకొంటున్నారు?
అలాంటిది ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టేశానంటే జనాలు ఆదరిస్తారా? మరీ దారుణంగా ఎన్నికలకు కేవలం 3-4 నెలల ముందు పార్టీని ప్రకటించడం అంటే ఎన్నో సందేహాలకు అంకురార్పణ చేయడమే. ఎవరికో లబ్ది చేకూర్చేందుకే లక్ష్మీనారాయణ పార్టీ పెట్టి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఏదైనా రంగంలోకి అంతో ఇంతో ఓట్లు చీలడం ఖాయం. కాబట్టి లక్ష్మీనారాయణ వెనక ఎవరున్నారు? ఎవరి కోసం ఓట్లు చీల్చాలనుకొంటున్నారు? అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇంకా మీడియా ముందుకు వెళ్లలేదు కాబట్టి ఓకే. వెళితే ఈ ప్రశ్న తప్పక తలెత్తుతుంది. దానికి లక్ష్మీనారాయణ ఏం సమాధానం చెబుతారోననేది ఆసక్తికరంగా మారింది.