ఒకవైపు పతనమవుతున్న వైసీపీని ఎలా లేపాలో తెలియదు కానీ అంతకంతకూ ఎదుగుతున్న టీడీపీని తొక్కేందుకు విఫలయత్నాలు చేస్తోంది బ్లూ మీడియా. రోజుకొక కొత్త కథనంతో తయారైపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారంటూ ఇటీవల కోడై కూసిన నీలి మీడియా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ పోతోంది. కథనాలను రోజుకో తీరున మారుస్తోంది. టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయాలంటే.. చాలా పెద్ద తతంగమే ఉందట. టీడీపీకి పెద్ద చంద్రబాబు మాత్రమే కాదు.. కొందరు మీడియా అధిపతులు, పార్టీ సీనియర్ నేతలు.. బ్లా బ్లా బ్లా అట. వీరందరి అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నీలి మీడియా చెబుతోంది.
ఇలాంటి ఐడియాలు మీకే వస్తాయా?
తాజా కథనమేంటో తెలుసా? టీడీపీ సీటుకు డిమాండ్ పెరగడంతో నాయకుల వెనుక ప్రజాదరణను చూడటం మానేసి వారి ఆర్థిక బలాన్ని బట్టి అర్హతను నిర్ణయిస్తోందట. ముందుగా ఎంత ఖర్చు పెట్టగలరో చూసి ఆ మేరకు టికెట్ కేటాయిస్తున్నారట. ఇలాంటి ఐడియాలు మీకే వస్తాయా? ఐ ప్యాక్ వంటి సంస్థలు ఇస్తున్నాయా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక బలం ఉంటే ఎన్నికల్లో నెగ్గుకు రావచ్చా? అంటే జనాలు డబ్బు తీసుకుని ఓట్లేస్తారని నేరుగా చెబుతున్నట్టే కదా. తమ పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న నేతలను పక్కనబెట్టి డబ్బుంటే చాలు వారికి టికెట్ ఇచ్చేస్తారా? ఇదేమైనా పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొచ్చిన పార్టీల్లో టీడీపీ ఒకటా? దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పార్టీ.
జనాల్లో చులకన చేయాలనేదే టార్గెట్..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాల్లో భాగస్వామ్యమవుతూ నేటికీ పార్టీని అంటిపెట్టుకున్న నేతలున్నారు. వారే ఆ పార్టీకి బలం. ఇలా టికెట్లను అమ్ముకుని ఉంటే పార్టీ సోదిలో కూడా ఉండేది కాదు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా గుడ్డ కాల్చి టీడీపీ నెత్తిన వేయాలి. జనాల్లో చులకన చేయాలనేదే టార్గెట్‌గా పెట్టుకుంది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతను ఎవరూ పట్టించుకోరని వైసీపీ.. దాని అనుబంధ మీడియా భావిస్తోంది. అంటే వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో జరుగుతున్న రాద్ధాంతం జనాల్లో హైలైట్ అవ్వొద్దంటే దానిని డైవర్ట్ చేయాలి కాబట్టి ఏదేదో చేస్తోంది. అయితే వైసీపీ అనుకుంటున్నట్టుగా ఎమ్మెల్యేల రాద్ధాంతం చిన్న గీత ఏమీ కాదు.. అత్యంత పెద్ద గీత. దాని పక్కన ఎన్ని గీతలు గీసినా అదే హైలైట్ అవుతుంది. జగన్‌కు చెందిన పిచ్చి మీడియా ఇంకెన్ని కథనాలు అల్లుతుందో చూడాలి.
--