టీడీపీ-జనసేనలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏపీకి సీఎం ఎవరు? అనే ప్రశ్న ఇరు పార్టీల నేతలకు ఎదురవుతూనే ఉంది. సమాధానం చెబుతూనే ఉన్నారు.. అయినా సరే.. మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న మీడియా ఆ పార్టీల నేతలపై సంధిస్తూనే ఉంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబే సీఎం అని తేల్చి చెప్పారు. దీనికి ఆయన చెప్పిన క్లారిఫికేషన్ కూడా చాలా స్పష్టంగా ఉంది. సమర్థవంతమైన నాయకత్వం, అనుభవమున్న నాయకత్వం అవసరమని గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తు చేశారు. ఈ విషయంలో మరో ఆలోచనే ఉండదని ఇరు పార్టీలు అనుభవానికే పెద్ద పీట వేస్తాయని స్పష్టం చేశారు. పవన్ ఎప్పటికప్పుడు తమ పార్టీ బలాబలాలను అంచనా వేసుకుంటూ వాస్తవాలకు అనుగుణంగా కార్యకర్తలను సైతం మోటివేట్ చేస్తున్నారన్నారని నారా లోకేష్ వెల్లడించారు. చంద్రబాబే సీఎం అని తేల్చి చెప్పారు.
పెద్ద రచ్చ అయిపోయింది..
టీడీపీ - జనసేన పొత్తు అనగానే వైసీపీకి గొంతులో వెలక్కాయ పడ్డంత పనైంది. అసలు ఈ పొత్తు సెట్ అవకూడదని నానా యత్నాలు చేసింది. కానీ అన్నీ విఫలమయ్యాయి. పొత్తు పొడిచింది. ఇక అప్పటి నుంచి మొదలు.. కేడర్ మధ్య చిచ్చు పెట్టడం.. ఆ తరువాత కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సీటు మీకు ఇవ్వరంటూ జనసేన కేడర్‌కు నూరి పోయడం ఆరంభించింది. ఇదొక పెద్ద రచ్చ అయిపోయింది. నిజానికి టీడీపీ, జనసేన అధినేతలు ప్రతి ఒక్క విషయంలోనూ ఫుల్ క్లారిటీగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం చాలా సార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కానీ పవన్ మాటల్లోని పరమార్థం చాలా మందికి అర్థం కాలేదు.
మరో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా?
పవన్ మాటలు వైసీపీ నేతలకు అర్థమైనా కానీ ఆ విషయాన్ని జనాలకు చెబితే తమకు రాజకీయంగా నష్టం చేకూరుతుంది కాబట్టి పవన్ మాటల సారాంశాన్ని మార్చేసి విషయం చిమ్ముతూనే ఉన్నారు. ‘‘ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనేదే నా ఉద్దేశ్యం’’ అని చెప్పారు. కొన్ని సార్లు సెటైరికల్‌గా కూడా పవన్ చెప్పారు. ‘‘సీఎం కావాలని పవన్ అనుకుంటే.. ఆయన మరో జగన్మోహన్ రెడ్డి అవుతారు కదా? ఇప్పటికే ఏపీకి ఒక జగన్మోహన్ రెడ్డి ఉండగా.. మరో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా?’’ అంటూ సెటైర్ వేశారు. అయినా సరే టీడీపీ, జనసేన అగ్రనేతలు మీడియా ముందుకు వస్తే అదే ప్రశ్న రిపీట్ అవుతూనే ఉంది. మొత్తానికి నారా లోకేష్ మరోసారి అయితే అనుభవానికే పెద్ద పీట వేస్తామని.. చంద్రబాబే సీఎం అని తేల్చారు.