అసలు ఏపీ వైసీపీలో ఏం జరుగుతోంది? ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎందుకొచ్చింది? అసలది నిజంగా వ్యతిరేకతేనా.. లేదంటే ఆ పేరుతో తప్పిస్తున్నారా? జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు కన్వర్ట్ చేస్తున్నారా? అంతమంది ఎమ్మెల్యేల్లో జనాల్లో వ్యతిరేకత ఉంటే ఇంతకాలం వైసీపీ అధినేత జగన్ ఎందుకు చూస్తూ కూర్చున్నట్టు? ప్రభుత్వంపై సానుకూలత ఉంటే అంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు కదా? ఏదో తాడేపల్లి ప్యాలెస్‌లో పనోళ్లను తీసేస్తున్నట్టు తీసేయడమేంటి? పోనీ తొలగిస్తే ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత రాదా? అది పార్టీకి నష్టం కాదా? ఇవన్నీ తెలియకుండానే జగన్ ఇలా చేస్తున్నారా? కొందరు నియోజకవర్గాల మార్పులేంటి? మన ఇంట్లో చెత్తను తీసుకెళ్లి పక్కింట్లో పడేసినంత మాత్రాన అది బంగారమవదు కదా? పైగా స్థానికత అంశం పార్టీకి ఇబ్బందికరం కాదా? ఎన్నో సమాధానాల్లేని ప్రశ్నలు..
ఏ ఆయింట్‌మెంటు పూస్తే సెట్ అవుతుంది?
గిల్లి జోల పడుతున్నారు.. ఏపీ సీఎం జగన్. నీకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని చెబుతూనే.. నువ్వు మంచోడివి.. నీకూ నీ కుటుంబానికి ఏ కష్టమూ రాకుండా చూసుకుంటా. మరొక పదవి కట్టబెడతానంటూ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూర్చొన్న సీటు నుంచి లేపేసి దానిని వేరొకరికి ఇస్తే ఎంత అవమానకరంగా ఉంటుంది. దానికి ఏ ఆయింట్‌మెంటు పూస్తే సెట్ అవుతుంది? ఏది రాసినా సరే అవమానభారమైతే తగ్గదు. నిన్నటికి నిన్న జగన్ పుట్టినరోజు వేడుకలకు కొందరు ఎమ్మెల్యేలు మొహం చాటేశారు. ఒకరిద్దరు బహిరంగ విమర్శలు చేశారు. రామచంద్రపురంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి వేణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు విధేయత చూపుతూనే ఏకి పారేశారు.
దొంగగానో.. లంజగానో చిత్రీకరించడం బాధించింది..
జగన్ తనను రాజమండ్రి రూరల్ కి అసెంబ్లీ సీటుకు వెళ్ళమన్నారని మంత్రి వేణు తెలిపారు. జగన్ కత్తితో తనను నరికేస్తానన్నా ఎందుకని అడక్కుంటా తల పెట్టేస్తానని.. కానీ టికెట్ విషయంలో తననొక దొంగగానో.. లంజగానో చిత్రీకరించడం బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానాన్ని మార్చిన మంత్రికే అంత బాధ ఉంటే.. టికెట్ ఇవ్వమన్న నేతలకు ఇంకెంత బాధ ఉంటుంది. అసలే జగన్ ప్రభుత్వంలో తమకు విలువే లేదని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. తమ పరిస్థితి వలంటీర్లకు ఎక్కువ.. మంత్రులకు తక్కువ అన్నట్టుగా తయారైందంటున్నారు. పేరుకు మాత్రం వలంటీర్ల కన్నా ఎక్కువైనా కూడా వారి కంటే తమ పరిస్థితి నీచంగా ఉందంటున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ నిర్ణయాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది త్వరలోనే తెలియ రానుంది.