తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసింది. ఇక సార్వత్రిక ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈసారి పార్లమెంటు స్థానాలు కోల్పోకుండా చూసుకోవాలని కాంగ్రెస్.. కనీసం పార్లమెంటు స్థానాలనైనా కాపాడుకుందామని బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలందరినీ పార్లమెంటు మెట్లెక్కించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా సమావేశమై చర్చలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు.
వారంతా పార్లమెంటు బరిలో..
ఇక బీఆర్ఎస్ దీనికేమీ తీసిపోలేదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా దూకుడుగా వ్యవహరించకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావుడిగా.. అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. అది ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో స్వయంగా చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాస్త నిదానంగా పనులు చక్కబెడుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు వారిని పార్లమెంటు బరిలో నిలిపి ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. కేంద్రంలో అధికారానికి సైతం ఇవే కీలకం కావడంతో కాంగ్రెస్, బీజేపీలు మరింత ఫోకస్ పెట్టాయి.
ఆ ముగ్గురు తలపడితే ఎవరు గెలిచి నిలుస్తారు?
ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. ముగ్గురు అగ్ర నేతలు మెదక్ పార్లమెంటు బరి నుంచి పోటీకి దిగుతున్నారట. వాళ్లెవరంటే.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి విజయశాంతి పోటీ చేయబోతున్నట్టు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్, ఈటల పోటీ చేశారు. కానీ ఈటల ఓటమి పాలయ్యారు. ఈసారి పార్లమెంటు బరిలో తేల్చుకోవాలని ఈటల ఉవ్విళ్లూరుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి మాదిరిగా ఈసారి మెదక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ త్రిముఖ పోరు ఎలా ఉంటుందో చూడాలని జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఆ ముగ్గురు తలపడితే ఎవరు గెలిచి నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ కీలక నేతలంతా ఈసారి పార్లమెంటు బరిలోకి దిగనున్నారని సమాచారం. బండి సంజయ్ వచ్చేసి తిరిగి కరీంనగర్ నుంచే పోటీ చేయనున్నారట.