వైసీపీ నేతలు టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొడవకుండా చూసేందుకు నానా తంటాలు పడ్డారు. అయినా సరే పొత్తు పొడిచింది. ఇక అక్కడి నుంచి మొదలు జనసేనకేదో అన్యాయం జరిగిపోతోందంటూ గళమెత్తారు. రెచ్చగొట్టేందుకు యత్నించారు. కార్యకర్తల మధ్య జరిగిన చిన్న గొడవను గాలివానగా మార్చేందుకు యత్నించారు. కృత్రిమ తుఫాన్‌ను సృష్టించాలనుకున్నారు. జనసేన, టీడీపీల మధ్య సీట్ల గొడవ పెట్టేందుకు యత్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రాధాన్యత తగ్గుతోందని ఘోషించారు. మొత్తానికి ఇరు పార్టీలకు ఏ నొప్పి లేదు కానీ ఏదో అయిపోతున్నట్టు క్రియేట్ చేసి వారి నొప్పులన్నీ వైసీపీ నేతలే పడ్డారు. ఇంత జరుగుతున్న టీడీపీ, జనసేన అగ్ర నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు.
సిగ్నేచర్ సాంగ్ పెట్టి మరీ..
నిన్న జరిగిన యువగళం-నవశకం సభతో ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇచ్చింది టీడీపీ. వైసీపీకి అయితే నేరుగా దెబ్బే. ఏం చేయాలో పాలుపోక.. ఎలా విమర్శించాలో తెలియక చివరకు ‘హైకమాండ్‌కు కట్టుబడి ఉండాల్సిందే’ అనే టైటిల్‌తో జనసేన-టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు చెప్పినట్టుగా ఓ ఆర్టికల్ ప్రచురించి కామ్ అయిపోయింది. యువగళం సభలో ఎక్కడా పవన్‌కు ప్రాధాన్యం తగ్గించలేదు. పవన్‌కు ఒక సిగ్నేచర్ సాంగ్ పెట్టి మరీ ఆయన వేదికపైకి వచ్చేటప్పుడు ఒక సిట్యువేషనల్ సాంగ్ మాదిరిగా అరేంజ్ చేశారు. జనసేన కార్యకర్తలకు ఇది గూస్‌బంప్స్ మూమెంట్. ఇరు పార్టీలూ నాయకులకే కాదు.. కార్యకర్తల విషయంలోనూ ఎలాంటి అరమరికలు లేకుండా వ్యవహరించడం విశేషం. చివరకు జెండాల విషయంలోనూ జాగ్రత్త పాటించారు. ఇరు పార్టీల జెండాలు సమానంగా కనిపించేలా ఏర్పాటు చేశారు.
ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది...
ఇక నేతల ప్రసంగాల్లోనూ ఎక్కడా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గకుండా వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. టీడీపీ నుంచి ఆరుగురు ప్రసంగిస్తే జనసేన నుంచి నలుగురు ప్రసంగించే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క నేత కూడా పవన్ గుణగణాలను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలియాలంటూ పవన్ కల్యాణే తన సినిమాలో ఓ డైలాగ్‌ను చెప్పారు. ఈ డైలాగ్‌ను టీడీపీ తూచ తప్పకుండా పాటించండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి వైసీపీ నేతలకు వాయిస్ లేకుండా చేసింది. పవన్‌ను చేగవేరా, నేతాజీ, భగత్‌సింగ్‌ల స్ఫూర్తిని అందిపుచ్చుకున్న వ్యక్తి.. ప్రజలు, సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకుడంటూ టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు కీర్తించారు. ఇంతకన్నా జనసేన నేతకు.. ఆ పార్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఏముంటుంది? ఇక విమర్శించడానికి తావెక్కడ? మొత్తానికి వైసీపీకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది.