ఏంటిది? స్ట్రోకులు మీద స్ట్రోకులు ఇస్తే వైసీపీ అధినేతతో పాటు పార్టీ నాయకులు తట్టుకునేదెలా? పొత్తుపై విమర్శలు చేద్దాం.. వేదికపైనో.. కిందో.. జెండాల విషయంలోనో.. ఏదో ఒక పాయింట్ పట్టుకుని విమర్శిద్దామనుకుంటే ఛాన్స్ లేకుండా చేశారు. పోనీ అలా వదిలేశారా? అంటే అదీ లేదు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల మాదిరిగా కొన్ని హామీలను మేనిఫెస్టోకు ముందే యువగళం సభలో రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మాదిరిగానే ఇక్కడ ఈ పార్టీలు సైతం తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి. ఇది తెలంగాణలో బాగా వర్కవుట్ అయ్యింది.
ఈ సదవకాశం మాకెప్పుడు?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశాన్ని కల్పించింది. మహిళలంతా ఫుల్ హ్యాపీ. ఈ విషయం ఏపీకి కూడా పాకింది. అక్కడి మహిళలు సైతం ఈ సదవకాశం తమకు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. టీడీపీ-జనసేనలు ఈ విషయాన్ని ప్రకటించడంతో మహిళలు ఫుల్ హ్యీపీ. ఇక యువతులకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అలాగే నిరుద్యోగులకు సైతం ఉద్యోగ కల్పన విషయంలో భరోసా ఇచ్చింది. అయిదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి సృష్టిస్తామని హామీ ఇచ్చింది. అలాగే నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు.18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకూ మహాశక్తి కార్యక్రమం కింద నెలకు రూ.1,500 ఇస్తామని టీడీపీ, జనసేనలు ప్రకటించాయి.
ఇంతకు మించిన భరోసా ఏముంటుంది?
చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని తెలిపాయి. అలాగే.. ప్రతి కుటుంబానికీ ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి. నిరుద్యో్గులు, మహిళలకు ఇంతకు మించిన భరోసా ఏముంటుంది? వీరంతా ఈ ప్రకటనలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు. ఇక రైతుల విషయానికి వస్తే.. ప్రతి రైతుకూ ఏటా రూ.20వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. యువతను బాగా చదివించే బాధ్యత తీసుకుంటామని... నాలెడ్జ్ ఎకానమీలో వారు ఎదిగేలా చేస్తామని తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తామని.. పేదలను ఆదుకుంటామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామని తెలిపారు. ఇక దాదాపు మేనిఫెస్టోకి ముందే అన్ని వర్గాలకు ఖుషీ ఖబర్ అయితే టీడీపీ, జనసేనలు చెప్పేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాదిరిగా మరికొన్ని ఎక్కువే గ్యారెంటీలు ఇచ్చి అదరగొట్టేశారు.