వేరొక దేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఆ మధ్య ఓ వైసీపీ నేత పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది పెద్ద రచ్చే అయ్యింది. దీనిని సమర్థించుకునేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. ఇక ఇప్పటికే గంజాయిల్ సప్లైలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. ఇప్పటికే ఈ విషయమై దేశ వ్యాప్తంగా ఏపీ నవ్వులపాలవుతుంటే.. తాజాగా ఎక్కడ గంజాయి, మత్తుమందులు పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే దొరుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీలోని విద్యావంతులు మండిపడుతున్నారు. తమది ఏపీ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి మినహా అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లారు.
గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని..
నెల్లూరుకు చెందిన ఇద్దరు వైసీపీ నేతల కుమారులు మాదక ద్రవ్యాల పార్టీ చేసుకుంటూ హైదరాబాద్‌లో అడ్డంగా పట్టుబడ్డారు. తెలంగాణ మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ ఆధారిటీ మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ప్రేమ్ చంద్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి మరీ పార్టీ చేసుకున్నారు. దాడి చేసిన పోలీసులు ప్రేమ్ చంద్‌తో సహా 12 మంది యువకులను అరెస్ట్ చేయగా.. మరో 21 మంది పరారీలో ఉన్నారు.
నోటికి పని చెబుతున్న వైసీపీ నేతలు..
ప్రేమ్‌చంద్ అరెస్ట్ విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతే ఎస్సార్‌నగర్‌లో పోలీసులు అప్పటికే తయారు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్టులో అసలు నిందితులైన ప్రేమ్‌చంద్‌తో పాటు మరో వైసీపీ నేత కుమారుడి పేర్లు గాయబ్ చేసేశారు. ఇది జరిగిన కథ. ఎఫ్ఐఆర్‌లో అంటే పేర్లు మాయమయ్యాయి కానీ ఈ జరిగిన రచ్చ మాత్రం క్షణాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు పాకిపోయింది. మొత్తానికి ఒకవైపు వైసీపీ ప్రజాప్రతినిధులు నోటికి పనిజెప్పి ఇష్టానుసారంగా హద్దూ అదుపు లేకుండా మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు. అది చాలదన్నట్టు వారి కుమారులు పార్టీల పేరుతో డ్రగ్స్‌ను వినియోగించి అలా కూడా ఏపీ పరువు తీసేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ డ్రగ్స్‌లో భాగంగా ముందు వైసీపీ నేతల కుమారులే పట్టుబడటం గమనార్హం. మొత్తానికి విదేశాల్లోనే పరువు తీస్తున్న వైసీపీ నేతలకు పక్క రాష్ట్రంలో పరువు తీయడం ఒక లెక్క కాదులే అని జనం పెదవి విరుస్తున్నారు.