టీడీపీ, జనసేనల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు రానున్న శాసనసభ ఎన్నికలకు పొత్తుతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. కేడర్ సంగతి ఎలా ఉన్నా కూడా వీరు మాత్రం ఒకే మాటపై ముందుకు వెళుతున్నారు. అయితే వీరి పొత్తు, సీట్ల సర్దుబాటు, ఇరు పార్టీల నేతల మధ్య నెలకొన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే విషయాలను సొంత పార్టీల నేతల కన్నా విపక్షాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి. వీరి మధ్య ఏ విషయంలో గొడవ వస్తుందా? రాకుంటే ఎలా గొడవ పెట్టాలా? అని ఎదురు చూసే గోతికాడ నక్కలు చాలానే ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ నచ్చజెప్పుకోవాల్సిందే.
అదే వైసీపీ దురాశ..
టీడీపీ, జనసేన కేడర్ మధ్య గొడవలు జరిగినా కూడా వైసీపీ దానిని హైలైట్ చేసి చూపిస్తోంది. అలాగే సీట్ల సర్దుబాటు గురించి జనసేనకు అన్యాయం జరిగిపోతుందని తెగ ఘోషిస్తోంది. దీనికి కారణం జనసేనపై ప్రేమ కాదు.. ఆ పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టి పొత్తును విఫలం చేసి లబ్ది పొందడం. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్క బోర్లా పడిన జనసేన చేత ఎలాగోలా పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు లాగించేలా చేస్తే అదెలాగూ అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉండదు కాబట్టి తాము వాటిని తమ ఖాతాలో వేసుకోవచ్చనేది వైసీపీ దురాశ. దీనికోసం రచ్చ చేస్తూ తన సొంత మీడియాతో చిచ్చులు పెట్టించే యత్నం చేస్తోంది.
తమకు అంత పట్టుందా?
వైసీపీ ఉచ్చులో చిక్కుకోకుండా ఇరు పార్టీలు తమ కేడర్‌కు నచ్చజెప్పుకుంటూ సంయమనంతో ముందుకు వెళ్లాల్సిన తరుణమైతే ఆసన్నమైంది. టీడీపీతో సమానంగా జనసేన కేడర్ సీట్లు కోరుకోవడమనేది సహజమే కానీ తమకు అంత పట్టుందా? అనేది కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణలో మాదిరిగా కాంగ్రెస్, సీపీఐ నేతలంతా కలిసి కట్టుగా పని చేసి అంతటి బలమైన బీఆర్ఎస్‌ను గద్దె దించిన మాదిరిగానే.. ఆంధ్రాలో టీడీపీ, జనసేనలు కూడా ఏ విషయంలోనూ గొడవలు పడకుండా కేడర్‌కు సర్ది చెప్పుకుని కలిసికట్టుగా పని చేస్తే వైసీపీని గద్దె దించడం ఖాయమే అవుతుంది. దీనికోసం ముందుగా సీట్ల సర్దుబాటు చేసుకుని అధికార పక్షం నోరు అయితే మూయించాలి.