ఏపీలో సిట్టింగ్‌లకు టికెట్ పక్కా అని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. తెలంగాణ ఎన్నికలకు తర్వాత ఆలోచన మార్చుకున్నారు. అసలే మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే వరుసబెట్టి సిట్టింగ్‌ల సీటు లాగేస్తున్నారు. పార్టీపై వ్యతిరేకత ఒకవైపు కలవరబెడుతుంటే.. మరోవైపు సిట్టింగ్‌లపై ఉన్న వ్యతిరేకత వైసీపీ అధినేతకు ఆందోళనకరంగా మారింది. దీంతో ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సర్వేల ప్రకారం జనంలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్‌లను తప్పించేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జుల నియామకంలో పెను మార్పులకు జగన్ తెరదీస్తున్నారు.
జ్యోతుల చంటిబాబుకి షాకిచ్చిన జగన్..
ఇటీవలే 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నలుగురిని ప్రకటించారు. కొందరి సీటును పూర్తిగా లాగేయగా.. మరికొందరికి స్థాన మార్పిడి చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబుకి సీఎం జగన్ షాకిచ్చారు. ఆయన స్థానంలో తోట నర్సింహాన్ని నియమించగా.. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును కాదని.. ఆయన స్థానంలో కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి ఇన్‌చార్జిని చేశారు. అంటే వంగా గీత ఈసారి పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు పిఠాపురం స్థానాన్ని జగన్ అప్పగించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎదుర్కోనున్న గోపాలకృష్ణ
రామచంద్రాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈసారి వేణు గోపాలకృష్ణను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. ఇక రామచంద్రాపురానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇక రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వేణుగోపాలకృష్ణ ఎదుర్కోనున్నారు. మొత్తానికి సర్వేలకు అనుగుణంగా ఇన్‌చార్జుల నియామకాన్ని జగన్ చేపడుతున్నారు. కానీ ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మంటను రగిలిస్తోంది. ఈ మంట దావానంలా మారే అవకాశమే కనిపిస్తోంది.