త్రిశంకు స్వర్గమనాలో.. నరకమనాలో కానీ మొత్తానికి బీజేపీ నేత ఈటల రాజేందర్ అయితే దానిలో ఊగిసలాడుతున్నారు. బీజేపీలోనే ఉండాలో.. పోవాలో తెలియదు. పార్టీలు మారినా సరే.. పట్టు వదలకుండా రాజకీయం చేసిన వ్యక్తి. అపర చాణిక్యుడైన కేసీఆర్‌ను ఉప ఎన్నికల్లో ఎదుర్కొని గెలిచి నిలిచిన వ్యక్తి. ఇప్పుడు మాత్రం ఏం చేయాలో పాలు పోక రేపేంటనే సందిగ్ధంలో క్షణమొక యుగంలా కాలం గడిపేస్తున్నారట. పెద్దలు చెప్పినట్టు తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండవు. కానీ ఆయన కాలు ఎటు వైపునకు కదపాలో తెలియక సందిగ్ధంలో ఉండిపోతున్నారట.
రేవంత్ ఆఫర్‌ను తిరస్కరించి..
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఈటల రాజేందర్. మంత్రిగానూ జనాలకు సేవ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నుంచి నాలుగు సాధారణ, మూడు ఉప ఎన్నికల్లో విజయం సాధించారాయన. అటువంటి ఈటల అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆఫర్‌ను కూడా కాదనుకుని బీజేపీలోకి అడుగులు వేశారు. అది తప్పా.. ఒప్పా అనేది ఆయన కోణం నుంచి ఆలోచిస్తే కానీ తెలియవు. నిజానికి బీజేపీలో కాకుండా కాంగ్రెస్‌లో చేరి ఉంటే మాత్రం కేసీఆర్ ఆయనను కేసుల పేరుతో బీభత్సంగా వేధించి ఉండేవారు. కానీ ఎదుర్కొనేందుకు సిద్ధపడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఉంటే మాత్రం జనం సింపతీతో పాటు మంచి సక్సెస్ ఆయనను వరించేది. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఆయన పరిస్థితి.
పార్టీలో తగ్గిన గ్రాఫ్..
తన నియోజకవర్గంలో గెలుస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్.. తన చాపకింద నీరులా చేరుతున్న కాంగ్రెస్‌ను విస్మరించేలా చేసింది. దీంతో ఎక్కవు సమయం కేసీఆర్‌ను ఓడించేందుకు కేటాయించి ఈటల రెండు చోట్ల దెబ్బతిన్నారు. ప్రస్తుతం ఆయను పార్టీలో పట్టించుకునే నాథుడే లేరట. ఒక్కసారిగా ఒంటరి అయిపోయి ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఒకవైపు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉండటం.. మరోవైపు పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకురాక పోవడంతో పార్టీలో ఈటల గ్రాఫ్ తగ్గిందట. చివరకు సొంత జిల్లాలోనే ఆయనకు ప్రాధాన్యం తగ్గిందట. ఇక ఎంపీ బండి సంజయ్‌కి పార్టీ పగ్గాలు ఇస్తారనే వార్తలతో ఆయనలో మరింత కలవరం మొదలైందట. ఏది ఏమైనా పవర్ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఈటలకు స్పష్టంగా తెలిసి వస్తోందట.