తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి మాత్రం ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకుని సొంత నియోజకవర్గాన్ని వదిలేసి రాష్ట్రమంతా పర్యటించారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన విజయానికి కృషి చేసిందెవరు? ఆయన్ను గెలిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నదెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగానూ.. హాట్ టాపిక్‌గానూ మారింది.
2018 ఫార్ములానే బీఆర్ఎస్ అమలు చేస్తే..
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు పెద్దలు. కానీ రేవంత్ మాత్రం ఈసారి ఇంటిని అసలు పట్టించుకోలేదు. తన కాన్సన్‌ట్రేషన్ మొత్తం రచ్చ గెలవడంపైనే పెట్టారు. ఆయనంత ధీమాగా ఉండటానికి కారణం ఆయన అన్న తిరుపతిరెడ్డేనట. 2018లో తన సోదరుడిని ఓడించిన బీఆర్‌ఎస్‌కు ఆయన గట్టి షాకే ఇచ్చారు.రేవంత్ విజయం వెనుక ఆయన అన్న కష్టం మరువలేనిది. అప్పట్లో మాదిరిగానే తిరిగి రేవంత్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం బాగా కష్టపడింది. అయినా సరే.. వారందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. 2018 ఫార్ములానే ఈసారి కూడా బీఆర్ఎస్ అమలు చేస్తే.. తిరుపతి రెడ్డి దానిని గట్టిగా తిప్పికొట్టారట.తన మరో సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపించారు.
ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి..
వాస్తవానికి బీఆర్ఎస్ పట్ల ఆయన పలు మార్లు తమ వ్యతిరేకతను అయితే ప్రదర్శించారు. ఇక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై నజర్ పెట్టారు.ఊరూ వాడా తిరిగి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వాళ్లను కూడా రప్పించే ప్రయత్నం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజానీకం వద్దకు వెళ్లి వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఎన్నికల సమయానికి రప్పించి వారి చేత ఓట్లు వేయించారు. తిరుపతి రెడ్డి కదలికలపై బీఆర్ఎస్ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారట. అయినా సరే.. వాటన్నింటినీ తిప్పికొడుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. ఎప్పటికప్పుడు తన తమ్ముడితో టచ్‌లో ఉంటూ వచ్చారు. మొత్తానికి సర్వశక్తులు ఒడ్డి రేవంత్ రెడ్డిని సోదరులు గెలిపించుకున్నారు.