నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పులు చేర్పులు వైసీపీలో దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీలో చిచ్చు రేపాయి. తెలంగాణలో ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ఏపీలో వైసీపీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టడంతో తన సీటు కిందకు నీరు రాకముందే వైసీపీ అధినేత జగన్ అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం మాదిరిగా ఉంది పరిస్థితి. కొందరు సిట్టింగ్‌లను మార్చక తప్పని పరిస్థితి. మారిస్తేనేమో సొంత పార్టీ నేతలతో తలనొప్పి.
బెంగుళూరు వేదికగా రసవత్తర రాజకీయం..
ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాజాగా తమ పార్టీ ఎంపీకి చెందిన గెస్ట్ హౌస్‌లో అసంతృప్త ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమయ్యారు. ఏపీ రాజకీయం ప్రస్తుతం బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యింది. బెంగుళూరు వేదికగా రసవత్తర రాజకీయం ఊపందుకుంది.ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పార్టీకి చెందిన పలువురు కింది స్థాయి నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు సీట్ల మార్పిడి చేస్తే పీఠం కదిలిస్తామని తెగేసి చెబుతున్నారు. స్థాన చలనం తప్పదంటే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
వైసీపీని ఎవరో ఓడించక్కర్లేదు..
బెంగుళూరులో రాయలసీమకు చెందిన ఓ ఎంపీ గెస్ట్‌హౌస్ వైసీపీలో పెను తుఫాన్‌కు వేదికగా మారింది. అక్కడ వైసీపీకి చెందిన దాదాపు 75 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు సమాచారం. అంటే పార్టీ ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో అటు ఇటు అయితే వైసీపీని ఎవరో ఓడించక్కర్లేదు. ఆ పార్టీ నేతలే ఓడిస్తారనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యేల స్థాన మార్పుతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతలు ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.