తెలుగు బుల్లితెరపై దాదాపు 105 రోజులుగా ఎంటర్‌టైన్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో.. ఈ ఆదివారంతో ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేను షో యాజమాన్యం, హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న వారిలో టాప్ 6గా అర్జున్, టాప్ 5గా ప్రియాంక, టాప్ 4గా ప్రిన్స్ యావర్, టాప్ 3గా శివాజీ ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ఇద్దరిలో విన్నర్‌గా రైతు బిడ్డ ప్రశాంత్ ట్రోఫీని సొంతం చేసుకోగా, అమర్ దీప్ టాప్ 2 స్థానంతో రన్నర్‌గా నిలిచాడు. అయితే విన్నర్, రన్నర్ స్థానాలు సొంతం చేసుకున్న వారు హ్యాపీగా ఉంటే.. వారి అభిమానులే బిగ్ బాస్ హౌస్ బయట అత్యుత్సాహం ప్రదర్శించారు.
బిగ్ బాస్ హౌస్‌లో అంతా బిగ్ బాస్ ఆడించినట్లుగా జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య గొడవలు, స్నేహాలు సహజం. అదే నిజం అనుకుని.. అన్నపూర్ణ 7 ఏకర్స్ బయట ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు వీరంగం సృష్టించారు. లోపల విన్నర్ అనౌన్స్‌మెంట్ జరిగే సమయానికి అధిక సంఖ్యలో అభిమానులు అన్నపూర్ణ 7 ఏకర్స్‌కు చేరుకున్నారు. ప్రశాంత్ విన్నర్ అని ప్రకటన రాగానే.. హౌస్ బయట ఉన్న అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఫలితంగా ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడున్న కార్లపై, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని, గత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్‌ల కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై గీతూ పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చిందని సమాచారం. తాజాగా తన కారు అద్దాలను ధ్వంసం చేసిన వారిపై అశ్విని ఫైర్ అవుతూ ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోతో అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందో ఓ క్లారిటీ వచ్చేస్తోంది. బిగ్ బాస్ విన్నర్ టాపిక్ కంటే కూడా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇది ఎంత వరకు వెళుతుందో చూడాల్సి ఉంది.