టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు హైదరాబాద్‌లోని జనసేనాని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇంతకుముందు చంద్రబాబు జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నాక ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి వచ్చారు. ఇక టీడీపీ-జనసేన పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్-చంద్రబాబు ఎప్పుడు కలిసినా అది రాజకీయ చర్చకు దారి తీస్తుంది.
ఇప్పుడు ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. ఇప్పుడు వీరి భేటీ అవడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్యన చర్చించినట్లుగా తెలుస్తుంది.
చంద్రబాబు-పవన్ భేటీ హైలైట్స్
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలు, ఇరు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చలు సంతృప్తికరంగా సాగాయి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వ్యూహాలు, మేనిఫెస్టోతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాల పైన చర్చలు సాగాయి.
భవిష్యత్తు కార్యాచరణ పై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ప్రణాళిక గురించి మాట్లాడుకున్నాం. పూర్తి సమన్వయంతో వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను ఎలా సాధించాలి అన్నదాని పైన చర్చలు సాగాయి.
ఇరు పార్టీల అధినేతల భేటీలో జరిగిన ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మాట్లాడుతాం.. అని తెలిపారు.