వైసీపీ పాలనకు కాలం చెల్లబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఫలితాలు ఏపీపై చాలా ప్రభావం చూపనుంది. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో కనపడిన దానికల్లా వైసీపీ రంగులు వేయడం తప్ప చేసిందేమీ లేదు. మొత్తానికి జగన్ అయితే అధికారం మాటున కేసులన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ కాలం వెళ్లదీశారు. కానీ ఇప్పుడు తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు గత ఎన్నికల్లో ఏ కేసులైతే జగన్‌ను అధికారంలోకి రప్పించాయో ఇప్పుడు అవే కేసులు అధికారం నుంచి తప్పించే పరిస్థితిని కల్పిస్తున్నాయి.
డామిట్ కథ అడ్డం తిరిగింది..
ఎందుకైనా మంచిదని ఎన్నికలలో ఈజీగా గెలిచేందుకు ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ జైలు పాలు చేశాడు. ఆపై టీడీపీ నేతలందరినీ మెల్లగా జైల్లోకి నెట్టాలనుకున్నాడు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. టీడీపీ నేతలంతా హ్యాపీగా బయటనే ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. దీనిని టీడీపీపైకి నెట్టి వైసీపీ చాలా లబ్ధి పొందింది. కోడికత్తితో దాడి చేయించుకుని దానిని కూడా టీడీపీ నెత్తినే వేసింది వైసీపీ. ఇక తానేదో దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లి వచ్చినట్టు అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్లొచ్చిన దగ్గర నుంచి బిల్డప్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులన్నీ తిరిగి జగన్‌ను చుట్టుముట్టనున్నాయి.
ఊహకందని ట్విస్టులు..
జగన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా సాగిపోతున్నఅక్రమాస్తుల కేసును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజే కదిలించారు. జగన్ సహా సీబీఐకి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టును సైతం కదిపేశారు. దీంతో అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతానికి సుప్రీం సిద్ధమైపోయింది. మరోవైపు కోడికత్తి కేసులో జగన్‌కు కోర్టుకు రప్పించాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిజానికి వైఎస్ వివేకా కేసులో ఊహకందని ట్విస్టులు ఎన్నో ఉన్నాయి. ఇవి మాత్రం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కనిపించడం లేదు. ఇక ఈ కేసు విచారణ తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. మొత్తానికి ఎన్నికల సమయానికి ఇవన్నీ టీడీపీ, జనసేనలు లైన్‌లోకి తీసుకు రాగలిగితే.. ఇక జగన్ ఇంటికేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.