ఏదో సామెత చెప్పినట్టుగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో తెలియక నేతలంతా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో పలు మార్లు పార్టీ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్‌ల సీట్లు కదిలించబోమని వారికి టికెట్ పక్కా అని తేల్చి చెప్పారు. దీంతో సిట్టింగ్‌లంతా ఫుల్ హ్యాపీ. కానీ తాజాగా వచ్చిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు మాత్రం ఏపీ సిట్టింగ్‌ల సీటు చిరిగిపోయేలా చేస్తున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జులను సైడ్ చేసిన వైసీపీ అధిష్టానం.. మొత్తంగా 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టబోతున్నట్లు టాక్.
వైసీపీ అధినేత నిర్ణయానికి క్లీన్ బౌల్డ్..
ఏదైనా న్యూస్ వచ్చిందంటే చాలు అన్ని శాఖల మంత్రి సజ్జల క్షణాల్లో టీవీల ముందు ప్రత్యక్షమై అవి ఎల్లో మీడియా వార్తలని చెప్పి ఖండించడమే కాదు. పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. అలాంటిది ఖండించలేదంటే ఏమనుకోవాలి? ఈ వార్తల్లో నిజముందనే కదా అనుకోవాలి. ఇక 65 మందిలో మంగళగిరి, అద్దంకి నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్చేసింది. తక్షణమే మరో మూడు వికెట్లు కూడా వైసీపీ అధినేత నిర్ణయానికి క్లీన్ బౌల్డ్ అయిపోయి పక్కకు వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు పర్వత పూర్ణచంద్రరావు, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబులను పక్కనబెట్టాలని జగన్ నిర్ణయించారు. జగన్ నిర్ణయమే శిరోధార్యమనుకున్న పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి అమరావతికి పిలిపించుకుని మరీ ఆ ముగ్గురికి తీరిగ్గా షాక్ ఇచ్చారు.
ఆ ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుందా?
ఈ సారి మీకు టికెట్లు ఇవ్వలేమని.. ఈసారి వీరి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చేది చెప్పి మరీ వారికి సహకరించాలని మిథున్ రెడ్డి హుకుం జారీ చేశారు. ఇది విన్న ముగ్గురూ అగ్గి మీద గుగ్గిలమయ్యారట. సీఎంతోనే తేల్చుకుంటామని తెగేసి చెప్పారట. అసలే జగన్.. కేసీఆర్ మాదిరి. ఆయన ప్రగతి భవన్ నిర్మించుకుంటే.. జగన్ తాడేపల్లిలో ఓ కోట నిర్మించేసుకున్నారు. ఈ కోట లోపలికి ఎవరికీ ప్రవేశం ఉండదు. మరి ఈ ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుందా? డౌటే. అంతగా అనుయాయుడిగా ఉండి.. అడుగులకు మడుగులొత్తిన ఆళ్ల రామకృష్ణారెడ్డినే జగన్ పట్టించుకోలేదు. అలాంటిది వీరిని పట్టించుకుంటారా? గతంలో సీఎం నుంచి కాల్ వస్తే అదృష్టంలా ఎమ్మెల్యేలు భావించేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ కాల్ వస్తే కలవరపడుతున్నారు. మరి నిజంగానే మరో 60 మంది జగన్ రిజెక్టెడ్ లిస్ట్‌లో ఉన్నారో లేదంటే ఇప్పటి వరకూ ఉన్న వారితో సరిపెడతారో చూడాలి.