సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో ఎన్నో చేదు అనుభవాలను ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది బబ్లీ బ్యూటీ తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించబోతోంది. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో యూనిట్ నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో తాప్సీ చిత్ర విశేషాలతో పాటు.. తన సొంత విషయాలను కూడా చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తనని ఐరన్ లెగ్ అంటూ విమర్శించారనే విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను నటించిన తెలుగు సినిమాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో నన్ను ఐరన్‌లెగ్ అంటూ విమర్శించేవారు. అప్పటికీ, ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కాలేదు.. అదేంటంటే కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల పరిధి కేవలం కొన్ని సీన్లు, సాంగ్స్‌కే పరిమితం అయి ఉంటుంది. అలాంటి సినిమాలు పరాజయం పొందితే.. అందుకు హీరోయిన్లను ఎందుకు బాధ్యుల్ని చేస్తారో ఇప్పటికీ నాకు తెలియలేదు. నా విషయంలో కూడా అదే జరిగింది. మొదట్లో ఇలా ఆలోచించి కాస్త బాధపడినా.. ఆ తర్వాత అలవాటైపోయింది. అప్పటి నుంచి ఆ విమర్శలను పట్టించుకోవడమే మానేశా.
ఇదనే కాదు.. కొత్తలో చేదు అనుభావాలు నాకు బోలెడన్నీ ఉన్నాయి. కొంతమంది అందంగా లేనన్నారు. ఓ సినిమా విషయంలో ఏం జరిగిందంటే.. నేను ఆ సినిమాలో నటించడం హీరో భార్యకు నచ్చలేదట. అందుకని ఆ సినిమా నుండి నన్ను తప్పించారు. డబ్బింగ్ సమయంలో హీరోకి నా వాయిస్ నచ్చలేదని డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డైలాగులు చెప్పించేవాళ్లు. ఒక సినిమాలో హీరో పరిచయ సన్నివేశం కంటే నా పరిచయ సన్నివేశం బాగుందని చెప్పి.. డామినేట్ చేస్తుందని మార్పించేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. వాటన్నింటిని ఫెయిల్యూర్‌గా భావించకుండా.. నా సక్సెస్‌కు మెట్లుగా భావించాను. అందుకే ఈ రోజు ఇలా ఉన్నానని తాప్సీ చెప్పుకొచ్చింది.