పుష్ప చిత్రంలో కేశవ పాత్రలో నటించిన బండారు జగదీశ్ ప్రతాప్.. జైలు నుండి బయటికి రావడం ఇక కష్టమే. రీసెంట్‌గా అతను ఓ యువతి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పుష్ప కేశవను నిందితుడుగా తేల్చి.. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో అసలు విషయం ఏమిటనేది తెలుసుకునేందుకు కేశవను కస్టడీకి తీసుకుని రెండు రోజుల పాటు విచారణ జరపగా.. అతను నేరం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. యువతిని ఫొటోలు తీసి బెదిరించినట్లుగా ఈ విచారణలో కేశవ ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే..సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కి వచ్చిన జగదీశ్‌కు అప్పట్లో ఒక యువతితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి.. వారిద్దరూ శారీరకంగానూ ఒక్కటయ్యే వరకు వెళ్లింది. అయితే పుష్ప సినిమాతో కేశవ క్రేజ్ పెరిగిపోవడంతో.. అది అతని ప్రవర్తనని మార్చివేసింది. ఈ ప్రవర్తన నచ్చని సదరు యువతి కేశవను దూరం పెట్టి.. మరో వ్యక్తికి దగ్గరైంది. ఇది తట్టుకోలేకపోయిన కేశవ.. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసి బెదిరించడం మొదలెట్టాడు. తనదారికి రాకుంటే.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని భయపెట్టడంతో.. అవమానం తట్టుకోలేక ఆ యువతి గత నెల 29వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి కేశవను అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో కేశవ అలియాస్ జగదీశ్ తన తప్పును ఒప్పుకున్నాడు. విచారణ ముగియడంతో పోలీసులు అతనిని మళ్లీ రిమాండ్‌కు పంపించారు.
కేశవ అరెస్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు పుష్ప 2 షూటింగ్‌పై పడినట్లుగా ఆ టీమ్ నుంచి వార్తలు వస్తున్నాయి. కేశవకు సంబంధించి కొంత పార్ట్ చిత్రీకరణ జరపాల్సి ఉందట. బెయిల్‌పై అతనిని తీసుకువచ్చి.. అది కంప్లీట్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. ఇప్పుడది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దీంతో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం.. ఈ సమస్యని లెక్కల మాస్టర్ ఎలా సాల్వ్ చేస్తాడో..