తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున హాట్ హాట్‌గా సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇదంతా ప్రజా సమస్యల కోసమనుకుంటే తప్పులో కాలేసినట్టే. తొలుత మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. నిన్న అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. ఆమె ప్రసంగం తప్పుల తడకగా ఉందని.. దీనికి సభ్యుడిగా తాను సిగ్గుపడుతున్నానన్నారు. పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన వారిపై నెపాన్ని నెట్టారంటూ మండిపడ్డారు. తాము ప్రజాపక్షమని.. కాంగ్రెస్ విపక్షమని విమర్శలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు కాలేదు కానీ డీఎస్సీ నోటిఫికేషన్ అతీ గతీ లేదంటూ ఎద్దేవా చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవ్..
కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదని... అచ్చోసిన ఆంబోతులా పోడియంకు వస్తామంటే ససరికాదని కాస్తంత ఘాటుగా సమాధానమిచ్చారు.
చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని రేవంత్ సెటైర్ వేశారు. గత పాలన గురించి చర్చ అంటే ఒక రోజంతా కేటాయిస్తామన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. అలాగే ప్రతిపక్షాలను గౌరవిస్తామన్నారు. ఇక ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదో పట్టించారని ఎమ్మెల్యే హరీష్ రావు స్టార్ట్ చేశారు. సభా రికార్డులు సరి చేయాలంటూ సూచనలు చేశారు.
నాడు బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది?
వైఎస్ కేబినెట్ నుంచి తాము బయటకు వచ్చింది మొదలు.. అప్పట్లో కాంగ్రెస్ పాలనను అంతా తిరగదోడి మరీ హరీష్ రావు ఎద్దేవా చేశారు. తమ కారణంగానే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కాంగ్రెస్ అధికారం తాము పెట్టిన భిక్ష అంటూ హరీష్ రావు మాట్లాడటం మంత్రి శ్రీధర్ బాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రజల తీర్పుతోనైనా బీఆర్ఎస్‌కు భ్రమలు వీడాలని.. రియలైజ్ కావాలన్నారు. నాడు బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో పోటీ చేసింది? ఎన్ని సీట్లలో విజయం సాధించిందని ప్రశ్నలు సంధించారు. తమ విజయానికి బీఆర్ఎస్సే కారణమనడం హాస్యాస్పదమని శ్రీధర్ బాబు అన్నారు. అయితే శ్రీధర్ బాబు తనను కెలికారంటూ ఫైర్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న రోజు వీరంతా ఏమయ్యారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.