వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఆయన నియంతలా మారి చేస్తున్న పనులతో చాలా మంది నేతలు విసుగెత్తిపోయారట. ఈ క్రమంలోనే టీడీపీలోకి వెళదామంటే.. నిన్న మొన్నటి వరకూ ఆ పార్టీ అధినేత నుంచి అందరినీ దారుణంగా తిట్టి ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లలేకపోతున్నారట. అలాగని వైసీపీలోనూ ఉండలేకపోతున్నారట. ఈ క్రమంలోనే వారంతా కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు టాక్. ఆ నిర్ణయం ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటారా?
రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. అయితే తెలంగాణలో ఈ దఫా కాస్త కుదుటపడింది. ఏపీలో మాత్రం పూర్తిగా పతనావస్థలోనే ఉంది. ఈ క్రమంలోనే జగన్ నిర్ణయాలతో విసుగెత్తిపోయిన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. పార్టీలో ఇమడలేక నిష్క్రమించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిన్న వరకూ పొగిడిన వైసీపీ మీడియా ఇప్పుడు ఆయనపై లేనిపోని అభాండాలన్నీ వేస్తోంది. ఆయనను దోషిని చేసి చూపించేందుకు ఆరాటపడుతోంది.
ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ పుడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే జగన్ తమకు కూడా ఇదే గతి పట్టిస్తారని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారట. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏపీకి అనుకూల వ్యాఖ్యలు చేయిస్తోంది. ఎన్నడూ లేనిది తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి ఇదే కారణమని తెలుస్తోంది. అలాగే సీఎం జగన్ చెల్లెలు షర్మిలను కూడా ఏపీలో వినియోగించుకోవాలని చూస్తోందట. తెలంగాణ ఆమెకు ఎలాగూ కలిసిరాక పోవడంతో ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని షర్మిల కూడా భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో త్వరలోనే పెను మార్పులు జరగబోతున్నాయని టాక్.