ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన మీదట ఒకవైపు హామీలు.. మరోవైపు ప్రజల సమస్యలను తెలుసుకోవడం.. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే విద్యుత్ రంగంలో జరిగిన అవినీతిపై ఆయన ఫోకస్ పెట్టారు. నెక్ట్స్ అధికారాన్ని అడ్బం పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో నేతలు జరిపిన భూ దోపిడీపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లలో చాలా మందిపై అప్పట్లో భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. చాలా కేసులు నమోదయ్యాయి కానీ పోలీసులు కేసులు నమోదు చేసే సాహసం కూడా చేయలేదు.
వెలుగులోకి కొత్త పేర్లు..
ఎన్నో భూములను ఏకంగా అప్పటి ప్రజాప్రతినిధులే కబ్జా చేశారు. బాధితులు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తొలుత సీఎం రేవంత్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో మొదలు పెట్టిన అధికారులు తీగ లాగితే డొంక కదిలినట్టు కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం విచారణలో మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు బయటకు వచ్చింది. ఇంకా మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములన్నింటినీ గత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టింది.
ఏ ఏ ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు వచ్చాయి?
దళితులకు ఇచ్చిన భూములే కాదు.. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ పాగా వేసేశారు. అధికార బలంతో పోలీసు కేసులు కూడా లేకుండా చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫిర్యాదులను వెలికి తీయడం ప్రారంభించారు. అయితే గతంలో పల్లా రాజేశ్వరరెడ్డిపై సైతం భూములు లాక్కొన్నారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీద.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులపైనా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఏ ఏ ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు వచ్చాయి? ఏ ఏ నేతలపైన ఆరోపణలు వచ్చాయన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మొత్తానికి భూ కబ్జాలు చేసిన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దడ పుట్టిస్తున్నారు.