తెలంగాణ, ఏపీ విడిపోయినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా మరో రాష్ట్రంలో చిచ్చు రేగుతుంటుంది. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు పెద్దగా ఎవరూ ఏపీ, తెలంగాణలను పోల్చేవారు కాదు. ఆయనకు సాధ్యమైనంత మేర అభివృద్ధి చేశారు. పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టారు. రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి తను చేశారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణతో ఏపీకి అప్పట్లో పోలిక లేదు. అప్పులు మూటగట్టుకుని వచ్చిన ఏపీని ఆ మేర అభివృద్ధి చేయడం గ్రేటని రెండు రాష్ట్రాల ప్రజానీకం పొగిడారు. అయితే ఏపీ సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి కంపారిజన్ మొదలైంది.
ఇప్పుడు అసలు కథ మొదలైంది..
కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా కూడా అభివృద్ధి అయితే పక్కాగా చేశారు. కానీ జగన్ అభివృద్ధి ఊసే ఎరుగరే. ఈ క్రమంలో తెలంగాణ పూర్తిగా అప్పుల్లో మునిగాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలుప చేపట్టారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఆయనేమీ వైసీపీ జోలికైతే రాలేదు కానీ దూకుడు నిర్ణయాలు.. ప్రజావాణి కార్యక్రమం.. తనను ఎంతగానో అవమానించిన కేసీఆర్‌ని పరామర్శించడం.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. వచ్చీరాగానే రైతు బంధు.. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన.. బెల్టు షాపుల మూసివేత వంటివన్నీ చేపట్టి జనాల్లో హీరోగా మారారు. ఇది చూసిన ఏపీ ప్రజానీకానికి మండిపోతోంది.
ఈ బటన్ నొక్కుడు సీఎం ఎక్కడ దొరికాడు?
మనకొక చేతగాని సీఎం దొరికాడు.. తెలంగాణకు సమర్థుడు దొరికారని జనాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌కు అనుభవం ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. కానీ అనుభవం ఉన్నవాడి మాదిరిగా చకచకా నిర్ణయాలు తీసుకోవడం.. అది కూడా ప్రజలకు చాలా మేలు చేసేవి కావడం ఏపీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఈ బటన్ నొక్కుడు సీఎం ఎక్కడ దొరికాడని తలలు పట్టుకుంటున్నారట. చంద్రబాబుకు అధికారం దూరం చేసి చాలా తప్పు చేశామన్న భావన జనంలో నానాటికి పేరుకుపోతోందట. ఒకవైపు రేవంత్ జనంతో నేరుగా అనుసంధానమవుతుంటే.. జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ పోలీసులతో పెద్ద కోటనే నిర్మించుకున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని వారంలోనే కూడగట్టుకుంటున్న రేవంత్‌కు నానాటికీ జనం విశ్వాసాన్ని కోల్పోతున్న జగన్‌కు ఎంతో తేడా ఉందని ఏపీ ప్రజలు అంటున్నారు.