వైసీపీలో ముసలం పుట్టింది. కొత్త ఇన్‌చార్జుల నియామకం చిచ్చు రేపుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. పార్టీలో ఎవరుంటారో.. ఎవరు పోతారో తెలియని పరిస్థితి. కొన్ని నెలల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలైన రాజీనామాలు.. ఊపందుకుని ఆ తరువాత కాస్త కూల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మళ్లీ రాజీనామాలు మొదలయ్యాయి. నిన్నటికి నిన్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తిరిగి రాజీనామాల పర్వం మొదలైంది. పార్టీలో అసంతృప్తులంతా క్యూ కట్టారు. ఆ తరువాత ఏ పార్టీలో చేరుతారో ఏమో కానీ ముందైతే పార్టీకి రాజీనామా చేస్తున్నారు.
వైసీపీలో కాక రేపుతున్న ఇన్‌చార్జుల మార్పు..
పోనీ అధిష్టానం ఏమైనా బుజ్జగింపులకు తెరదీస్తుందా? అంటే అదీ లేదు. పోతే పోనీ అన్నట్టుగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన అనంతరం మంగళగిరి వైసీపీకి ఇన్ ఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ నియోజక ఇన్చార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముఖ్యంగా ఇన్‌చార్జుల మార్పు అంశం కూడా వైసీపీలో కాక రేపుతోంది. రేపల్లె ఇన్‌చార్జిగా డాక్టర్ ఈవూరు గణేష్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే గణేష్ నియామకాన్ని ఎంపీ మోపిదేవి వర్గం వ్యతిరేకిస్తోంది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి.
వై 75 అనుకునే పరిస్థితి వస్తుందేమో..
రాను రాను వైసీపీలో గొడవలు మరింత పెరుగుతున్నాయి. దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. వాటిని సద్దుమణింపచేసే పనులైతే అసలు వైసీపీ అధిష్టానం చేపడుతున్నదే లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ కలహాల పార్టీకి వైనాట్ 175 పోయి.. వై 75 (75 కూడా ఎందుకు?) అని జనాలు అనుకునే పరిస్థితి దాపురిస్తుందేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలే ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. నిరుద్యోగుల పరిస్థితి సరేసరి. అవకాశం ఎప్పుడు వస్తుందా? వైసీపీని భూస్థాపితం చేద్దామా? అన్నట్టుగా ఉన్నారు. ఇక ఇప్పుడు అంతర్గత కలహాలతో ఒక వైసీపీ నేతను మరో వైసీపీ నేతే ఓడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.